నెల్లూరు : పేదల ఇళ్ల నిర్మాణాలు ఒక్కొక్కటిగా పూర్తి కావడం తన మనసుకు ఎంతో
సంతృప్తినిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
పేర్కొన్నారు. శనివారం సర్వేపల్లి నియోజకవర్గం లోని వెంకటాచలం జగనన్న కాలనీని
సందర్శించిన మంత్రి, స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వెంకటాచలం మండలానికి చెందిన
గిరిజనుల ఇంటి నిర్మాణానికి రూ 15 వేల రూపాయల ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ
చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు
ఉండకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి
ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. గతంలో ఇళ్ల
స్థలాల కోసం కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి
ఇల్లు కట్టించినట్లు చెప్పారు.
*వెంకటాచలంలో కోట్లాది రూపాయల విలువచేసే భూములను కొనుగోలు చేసి పేదల ఇంటి
నిర్మాణానికి కేటాయించి, ఇల్లు కట్టుకోవడానికి రూ. 1.80 లక్షలు మంజూరు చేసామని
చెప్పారు. ఈ లేఅవుట్ లో 9 అంకణాల స్థలం విలువ సుమారు 5 లక్షల పైగా ఉందన్నారు.
ఇంతటి ఖరీదైన స్థలాల్లో నిరుపేదలు చక్కగా ఇళ్లను నిర్మించుకోవడం తనకు ఆత్మ
సంతృప్తిగా ఉందన్నారు. ఒకటిన్నర సెంటు స్థలంలో ఏం ఇల్లు కట్టుకుంటారని ఎగతాళి
చేసిన వారికి పూర్తి చేసుకున్న ఈ అందమైన ఇళ్లులే సమాధానం చెబుతాయన్నారు.
ఖరీదైన ఈ లేఅవుట్ లో పేదలకు స్థలాలు ఇస్తే ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు
వస్తుందేమోనని భావించి, ఇవి దేవాదాయ భూములని, ఇక్కడ స్థలాలు ఇవ్వకూడదని
కొంతమంది దురుద్దేశంతో కోర్టుల్లో కేసులు వేశారని, అన్నీ అడ్డంకులను అధిగమించి
ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు మంత్రి గుర్తు చేశారు. అలాగే
నిరుపేదలైన గిరిజన కుటుంబాలకు త్వరగా ఇల్లు నిర్మించుకునేందుకు అన్ని విధాల
అండగా నిలుస్తున్నామని, పొదుపు సంఘాల ద్వారా రూ 35వేలు వడ్డీ లేని రుణాన్ని
అందజేయడంతో పాటు, సంఘాల్లో సభ్యులుగా లేని వారికి రూ:15వేలు పూర్తి ఉచితంగా
అందిస్తున్నట్లు చెప్పారు. గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ
ఇళ్ల నిర్మాణాలను మరింత వేగంగా పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కాంట్రాక్టర్లు కూడా గిరిజనుల ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరగా
ఇల్లు కట్టించి ఇవ్వాలని సూచించారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి
తీసుకురావాలని చెప్పారు. వచ్చే నెల నుంచి అన్ని లే అవుట్లలో పూర్తయిన ఇళ్లకు
గృహప్రవేశాలు చేస్తామని మంత్రి చెప్పారు. తొలుత జగనన్న కాలనీలో పూర్తయిన
ఇంటిని మంత్రి ప్రారంభించి, ఆ కుటుంబ సభ్యులను అభినందించారు. తమకు ఖరీదైన
స్థలాన్ని మంజూరు చేసి తమ సొంతింటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రికి, మంత్రికి
కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాలనీలోని పలు ఇళ్లను
మంత్రి సందర్శించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో 108 మంది గిరిజనులకు ఇంటి
నిర్మాణాలకు రూ 15వేలు అదనపు ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. ఈ
కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట రమేష్, డిఈఈ బివి సత్యనారాయణ రావు, ఎఈ సిహెచ్
వెంకటేశ్వర్లు, వర్క్ ఇన్స్పెక్టర్ సుస్మిత, స్థానిక ప్రజా ప్రతినిధులు మందల
వెంకట శేషయ్య, కోదండరామిరెడ్డి, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.