ఏపీకి కేంద్రం 22 లక్షల ఇళ్ళు ఇచ్చింది
సర్పంచులను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం
రాజమహేంద్రవరం : ఏపీకి కేంద్రం 22 లక్షల ఇళ్ళు ఇచ్చిందని, రాజమండ్రికి లక్షా
86 వేల ఇళ్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో సమాధానం
చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో
ఇళ్ల నిర్మాణంపై జగన్ ప్రభుత్వాన్ని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి
సూటిగా ప్రశ్నించారు. బుధవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ ఏపీకి కేంద్రం 22
లక్షల ఇళ్ళు ఇచ్చిందని రాజమండ్రికి లక్షా 86 వేల ఇళ్లు కేటాయిస్తే వైసీపీ
ప్రభుత్వం ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో
జాతీయ రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
పంచాయతీల నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్ళించటం శోచనీయమన్నారు. సర్పంచులను
వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. పార్టీలకతీతంగా బీజేపీ దగ్గరకు
వచ్చిన సర్పంచులకు బీజేపీ అండగా ఉంటుందని ఏపీ బీజేపీ చీఫ్ భరోసా ఇచ్చారు. ఆవ
భూముల కొనుగోళ్ళలో వైసీపీ నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలే
ఇసుక, మట్టి మాఫియాలుగా మారారన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోటం వల్ల
కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు మూడు వేల కోట్ల ధరలస్థిరీకరణ నిధి
ఎందుకు ఏర్పాటు చేయలేదో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రజలను మోసం
చేస్తున్నారని అన్నారు. ఏపీలో ప్రజలకు మేలు చేయలేని స్థితిలో జగన్
ఉన్నారన్నారు. రాష్ట్రంలో సర్పంచులకు మద్దతుగా ఆగస్టు 10న జిల్లా స్థాయిలో,
ఆగస్టు 17న రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. పోలవరం
నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పునరావాస ప్యాకేజీ
విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన గణాంకాలు కేంద్రానికి ఇవ్వటం లేదన్నారు. జనసేనతో
పొత్తు కొనసాగుతుందని దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు.