కొత్తగా జాబితాలో చేరింది 22,38,952 మంది
జాబితా నుంచి 16,52,422 ఓట్ల తొలగింపు
ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో 5,86,530 మంది పెరుగుదల
తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 4,08,07,256కు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 చేపట్టిన ఎన్నికల సంఘం సోమవారం తుది జాబితా ప్రచురించింది. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో నికరంగా 5,86,530 మంది ఓటర్లు పెరిగారు. గతేడాది అక్టోబరు 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 4,02,21,450 మంది ఓటర్లు ఉండగా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా 22,38,952 మంది ఓటర్లను జాబితాలో చేర్చింది. 16,52,422 మందిని తొలగించింది. మొత్తంగా ఓటర్ల నికర పెరుగుదల 1.46 శాతంగా ఉంది. తుదిజాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 6,55,130 మంది అధికంగా ఉన్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా వెల్లడించారు.
25 జిల్లాల్లో పెరుగుదల : ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 25 జిల్లాల్లో పెరగ్గా ఒక్క నెల్లూరు జిల్లాలో స్వల్పంగా తగ్గింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 45,403 మంది, అన్నమయ్య జిల్లాలో 44,614 మంది, కర్నూలు జిల్లాలో 43,466 మంది ఓటర్లు పెరిగారు. నెల్లూరు జిల్లాలో 2,934 మంది తగ్గారు.
కర్నూలులో అత్యధికం..అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పం
రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాల్లో కర్నూలు (20,16,396) మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో అనంతపురం (19,96,637), విశాఖపట్నం (19,46,224), నెల్లూరు (19,08,498) జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువ ఓటర్లు కలిగిన జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా (7,61,538) తొలి స్థానంలో, పార్వతీపురం మన్యం జిల్లా (7,77,764) రెండో స్థానంలో ఉన్నాయి. శ్రీకాకుళం, ప్రకాశం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.
214 పోలింగ్ కేంద్రాల పెరుగుదల : 2023 జనవరి 5 నాటికి రాష్ట్రంలో 45,951 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 46,165కు పెరిగింది. ప్రత్యేక సమగ్ర సవరణ- 2024లో భాగంగా 214 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో గరిష్ఠంగా 1,500 ఓట్లు ఉంచారు.