కాకినాడ : రాష్ట్రంలో తొలిసారిగా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో తల్లి పాల నిధిని
ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకమని, ఈ తల్లి పాల నిధి ద్వారా నవజాత శిశువులకు
ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా పేర్కొన్నారు.
సోమవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పిల్లల వార్డులో ఏర్పాటుచేసిన
తల్లి పాల నిధిని జిల్లా కలెక్టరు కృతికా శుక్లా ధరిత్రి, సుషేనా ఫౌండేషన్ల
ప్రతినిధులు, జీజీహెచ్ వైద్య అధికారులతో కలిసి ప్రారంభించారు. తొలుత
డాక్టర్స్, ఇంజక్షన్స్ చూసి భయపడే చిన్నారులకు వారిలోని భయాన్ని తొలగించే
నిమిత్తం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో లక్ష
రూపాయలతో వార్డుల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతో పాటు, చక్కని వాల్
పెయింటింగ్స్ ను జిల్లా కలెక్టరు కృతికా శుక్లా రెడ్ క్రాస్, స్వచ్ఛంద సంస్థల
ప్రతినిధులు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా
కలెక్టరు మాట్లాడుతూ ధాత్రి లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ (సీఎల్ఎంసీ) ను
సుషేనా, ఎన్.సీ.సీ, ఇతర స్వచ్ఛంద సంస్థల సీఎస్ఆర్ నిధుల రూ. 50లక్షలతో తల్లి
పాల నిధిని కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇది
ఏపీలోనే మొట్టమొదటిసారిగా జిజిహెచ్ లో ప్రారంభించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని
కలెక్టరు తెలిపారు. తొమ్మిది నెలల క్రితం ధాత్రి, సుషేనా ఫౌండేషన్ల
ప్రతినిధులతో ఎంవోయూ చేసుకోవడం జరిగిందన్నారు. మెదటి ఆరు నెలలు తల్లి పాలు
శిశువుకు మంచి ఆరోగ్యం, వ్యాధినిరోధక శక్తిని ఇస్తుందన్నారు. ఇప్పటి వరకు
వివిధ కారణాల వల్ల తల్లి పాలు లేని, ఎన్ఐసీయూలో చికిత్స పొందే శిశువులకు డబ్బా
పాలు పట్టించేవారమని, ఇటువంటి సమస్యలను అదిగిమించేందుకు ఈ తల్లి పాల నిధి ఎంతో
ఉపయోగపడుతుందని కలెక్టరు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు
చేసిన తల్లి పాల నిధి ద్వారా ఆరోగ్యవంతమైన తల్లుల నుంచి పాలు సేకరించడం
జరుగుతుందన్నారు. సేకరించిన పాలను ల్యాబ్ కు పంపించి పరీక్షలు పూర్తయిన
అనంతరమే శిశువులకు అందివ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. దేశవ్యాప్తంగా
ఇప్పటివరకు సుమారుగా 80 తల్లి పాల నిధులు మాత్రమే ఉన్నాయని, గర్భిణీ స్త్రీలు,
బాలింతలతో ఎక్కువగా సత్ సంబంధాలు ఉన్న పారా మెడికల్ సిబ్బంది, నర్సులు
తల్లిపాల నిధిపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టరు తెలిపారు.తల్లి పాల నిధి
ఏర్పాటుకు కృషిచేసిన జిజిహెచ్ వైద్య బృందాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా అభినందనలు
తెలియజేశారు. అనంతరం ధాత్రి, సుషేనా ఫౌండేషన్ ప్రతినిధులను కలెక్టరు కృతికా
శుక్లా సత్కరించారు. అనంతరం అనాధలకు, జిజిహెచ్ లో పేదలకు బట్టలు అందించే
నిమిత్తం కాకినాడ ఐఎంఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బట్టల సేకరణ బాక్సును కలెక్టరు
ప్రారంభించారు.