తెలంగాణలో తన విస్తరణకు ప్రణాళికను ప్రకటించింది. ఈమేరకు ఐటీ శాఖ మంత్రి
కేటీఆర్‌తో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆ సంస్థ సీఈఓ సోలమన్ భేటీ అయ్యారు.
ఇప్పుడు వరకు 1000 ఉద్యోగాలు ఉన్న చోట 2000 మంది నిపుణులకు అదనంగా ఉద్యోగ
అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్
దిగ్గజ సంస్థ గోల్డ్‌మెన్ సాచ్ తెలంగాణలో తన భారీ విస్తరణ ప్రణాళికలను
ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో అమెరికాలోని
న్యూయార్క్ నగరంలో కంపెనీ కేంద్ర కార్యాలయంలో సంస్థ ఛైర్మన్, సీఈఓ డేవిడ్ ఎం
సోలమన్‌తో నేడు సమావేశమయ్యారు. బృంద చర్చల అనంతరం కంపెనీ ఈమేరకు తన ప్రకటనను
తెలిపింది. హైదరాబాద్ నగరంలో గోల్డ్‌మెన్ సాచ్ సంస్థ కార్యకలాపాలను పెద్ద
ఎత్తున విస్తరించేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఆ సంస్థ ప్రకటించిన
విస్తరణ ప్రణాళికలలో భాగంగా ప్రస్తుతం 1000 మంది ఉన్న చోట రెండు రెట్లు పెంచి
2000 మంది నిపుణులకు అదనంగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్లు సంస్థ
ప్రకటించింది. ఇందుకోసం సుమారు మూడు లక్షల చదరపు అడుగల విస్తీర్ణం గల కార్యాలయ
విస్తరణను చేపట్టనున్నట్లు వివరించింది. బ్యాంకింగ్ సేవలు, బిజినెస్
అనలిటిక్స్, ఇంజినీరింగ్ వంటి వివిధ రంగాలలో గోల్డ్‌మెన్ సాచ్ సంస్థ
కార్యకలాపాల బలోపేతం కోసమే ఈ నూతన కేంద్రం పనిచేయనున్నట్లు వెల్లడించింది.
ఇందుకు మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు.
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా గతవారం అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్
వెళ్లారు. అంతకంటే ముందు ఇదే ఏడాది మే నెలలో యూకే, అమెరికా పర్యటనలు చేసి
విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చారు. 80కి పైగా వ్యాపార సమావేశాలకు హాజరైన
కేటీఆర్. న్యూయార్క్, లండన్, హ్యూస్టన్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్లలో
పర్యటించారు. ఈ పర్యటన రెండు వారాల పాటు సాగింది. పలు సంస్థలు తెలంగాణలో
పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా ఆ సంస్థల పెట్టుబడులతో దాదాపు 42 వేల
మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ కార్యాలయం
ప్రకటనను విడుదల చేసింది.
రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ,
మెడ్‌ట్రానిక్, స్టేట్ స్ట్రీట్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూపు, వీఎక్స్ఐ
గ్లోబల్ సొల్యూషన్స్, డాజోన్, అలియంట్, స్టెమ్‌క్రూజ్, మాండీ, జాప్‌కామ్,
టెక్నిప్ ఎఫ్ఎంసీ వంటి గ్రూపులు ఉన్నాయి. దాదాపు 30 కంపెనీలకు చెందిన ఎన్నారై
సీఈఓలతో మంత్రి కేటీఆర్ సమావేశాలు నిర్వహించి.. ద్వితీయ శ్రేణి నగరాల్లో
పెట్టుబడుల అవకాశాలను వివరించారు. దీనిలో నల్గొండలో సొనాటా సాఫ్ట్వేర్ కంపెనీ,
కరీంనగర్లో 3ఎం-ఎక్లాట్, వరంగల్‌లో రైట్ సాఫ్ట్వేర్ సంస్థలు కార్యకలాపాల
విస్తరణకు అంగీకరించాయని ప్రకటనలో తెలిపారు.