ఏపీజెన్కో, ఎన్హెచ్పీపీ మధ్య అంగీకారం
నేడు సీఎం సమక్షంలో ఎంఓయూ
అమరావతి : రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్
(ఏపీజెన్కో), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్
కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) సంయుక్తంగా పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు
(పీఎస్పీ) నిర్మించాలని నిర్ణయించాయి. నంద్యాల జిల్లాలోని యాగంటిలో 1000
మెగావాట్లు, అనంతపురం జిల్లా కమలపాడులో 950 మోగావాట్లు కలిపి మొత్తం 1950
మెగావాట్ల సామర్థ్యంతో రెండు పీఎస్పీలను సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించాలని
రెండు సంస్థలు పరస్పరం అంగీకరించాయి. ఇందుకు సంబంధించి స్పెషల్ పర్పస్
వెహికల్ (జేపీవీ) ఏర్పాటు చేయనున్నాయి. రెండు పీఎస్పీల ఏర్పాటుకు సంబంధించి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంధన, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల
శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం ఏపీజెన్కో,
ఎన్‌హెచ్‌పీసీ ప్రతినిధులు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేయనున్నారు.
సరిసమాన భాగస్వామ్యం (50:50 వాటా)తో పీఎస్పీలు నిర్మించాలని ఏపీజెన్కో,
ఎన్‌హెచ్‌పీసీ నిర్ణయం తీసుకున్నాయి.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో నిర్ణయం ప్రకారం విశాఖపట్నంలో జరిగిన
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ, ఏపీజెన్కో పునరుత్పాధక ఇంధన
ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర
ఇంధన, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పది పీఎస్పీల
ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని నెడ్‌క్యాప్‌ను ఆదేశించారు. ఈ
నేపథ్యంలో ఏపీజెన్కో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి కూలంకుషంగా అన్ని
అంశాలపై లోతుగా చర్చించి రాష్ట్రంలో కొత్తగా పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు
నిర్మించాలని నిర్ణయించింది.
అయిదు ప్రాజెక్టుల కోసం నివేదిక : నంద్యాల జిల్లాలోని యాగంటిలో (1000
మెగావాట్లు), అనంతపురం జిల్లాలోని కమలపాడులో (950 మెగావాట్లు), వైఎస్సార్
జిల్లాలోని అరవీటిపల్లిలో (1320 మెగావాట్లు), అన్నమయ్య జిల్లాలోని గడికోటలో
(800 మెగావాట్లు), వైఎస్సార్ జిల్లాలోని దీనేపల్లిలో (750 మెగావాట్ల)
సామర్థ్యంతో పీఎస్పీల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని
నెడ్‌క్యాప్‌ను ఏపీజెన్కో కోరింది. ఈ ప్రాజెక్టులపై ఫీజిబులిటీ నివేదికల
ఆధారంగా యాగంటి, కమలపాడులో మొదటి దశలోను, మిగిలిన చోట్ల రెండో దశలోను
పీఎస్పీలు ఏర్పాటు చేయాలని ఏపీజెన్కో నిర్ణయించింది.
ఒప్పందంతో ప్రయోజనాలు : మినీరత్న హోదా గల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ
ఎన్‌హెచ్‌పీసీ సహకారంతో ఈ ప్రాజెక్టులు నిర్మించడంవల్ల ప్రాథమికంగా
పెట్టుబడులు పెట్టాల్సిన భారం ఏపీజెన్కోకు తప్పుతుంది. ఎక్కువ మొత్తంలో
పెట్టుబడులు పెట్టకుండానే రాష్ట్రంలోని వనరులను గరిష్ట స్థాయిలో
వినియోగించుకుని ప్రజలకు అందించే వెసులుబాటు కలుగుతుంది. జాయింట్ వెంచర్
ద్వారా పెట్టుబడులు/ రిస్క్‌లు పరస్పరం పంచుకోవడంవల్ల ఏపీజెన్కోకు భారీ
పెట్టుబులు పెట్టాల్సిన శ్రమ, రిస్క్ తప్పుతాయి. త్వరితగతిన ప్రాజెక్టులు
పూర్తి చేయడం ద్వారా సామర్థ్యం పెంచడంపాటు పీక్‌లోడ్ సమయంలో గ్రిడ్‌ను
బలోపేతం చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (ఎన్‌హెచ్‌పీసీ)ని భాగస్వామిగా
చేసుకోవడంవల్ల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సీడబ్ల్యూసీ, సీఈఏ, తదితర సంస్థల
నుంచి సులభంగా, త్వరితగతిన అనుమతులు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ రంగంలో
సుదీర్ఘ అనుభవం ఉన్న ఎన్‌హెచ్‌పీసీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడంవ్లల దాని
అనుభవం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం , ఆర్థిక వనరులు ఈ ప్రాజెక్టులు త్వరత గతిన
పూర్తికావడానికి ఎంతోఉపయోగపడతాయి. ఇటు ఏపీజెన్కోకు, అటు రాష్ట్ర ప్రజలకు ఈ
ఒప్పందంవల్ల అన్ని విధాలా ప్రయోజనం కలుగనుంది.
సీలేరులో సొంతంగా పీఎస్పీ : అప్పర్ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో
ఏపీజెన్కో సొంతంగా పీఎస్పీ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే
పర్యావరణ అనుమతులతోపాటు అన్ని రకాల అనుమతులు వచ్చాయి. పీఎస్పీ ఏర్పాటు కోసం
ఏపీజెన్కో టెండర్లు పిలిచింది. విద్యుత్ సామర్థ్యం పెంచడంతోపాటు పీక్ లోడ్
సమయంలో వైఫల్యం చెందకుండా గ్రిడ్ ను బలోపేతం చేయానికి ఈ పీఎస్పీ ఎంతో
ఉపయోగపడనుంది.