విశాఖపట్నం : రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు బాగా
కురుస్తున్నాయి. రిజర్వాయర్లు నిండుతున్నాయి. పంటలు బాగా పండుతున్నాయి. దాంతో
పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. అందుకే ఆ స్థాయిలో
రాష్ట్రం అభివృద్ధి చూపుతోందని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ
అమర్నాథ్ అన్నారు.
దావోస్ నుంచి ఆహ్వానం : దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలకు రాష్ట్ర
ప్రభుత్వానికి ఆహ్వానం రాలేదని, అందుకే ఇక్కడి నుంచి ఎవరూ వెళ్లలేదని
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎంకి గత ఏడాది
నవంబరు 25న అక్కడి నుంచి ఆహ్వానం అందింది.
రాష్ట్రంలో సుపరిపాలన : వచ్చే మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్
ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. దానికి దావోస్ నుంచే ఇక్కడికి అందరినీ
రప్పించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. సీఎంగారి సుపరిపాలన, అన్ని రంగాల్లో
రాష్ట్రం అభివృద్ధి. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నెంబర్ వన్. అలాగే దేశంలో మిగిలిన
రాష్ట్రాల కంటే ఎక్కువ జీడీపీ 11.43 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. దాదాపు
రూ.1.50 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. గత అక్టోబరు 31 నాటికే
రాష్ట్రం నుంచి దాదాపు రూ.97 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరిగితే, మీరు పోల్చి
చూస్తున్న తెలంగాణ నుంచి అదే సమయంలో జరిగిన ఎగుమతుల విలువ రూ.55 వేల కోట్లు
అని పేర్కొన్నారు.
గతంలో కంటే ఎక్కువ పెట్టుబడులు : ఇప్పుడు ప్రభుత్వం మీద పదే పదే తప్పుడు
ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి శ్వేతపత్రం డిమాండ్
చేశారు. గత 5 ఏళ్ల కాలంలో.. ఆనాడు కోవిడ్ వంటి సమస్య లేదు. అప్పుడు వచ్చిన
పెట్టుబడులు, ప్రభుత్వం చేసిన ఆర్భాట ప్రచారాలు, నాలుగు పర్యాయాలు భాగస్వామ్య
సదస్సులు నిర్వహణ..ఇవన్నీ చూసినా, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏటా వచ్చిన
సగటు పెట్టుబడులు రూ.11 వేల కోట్లు మాత్రమే. అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత,
ఈ మూడున్నర ఏళ్లలో, ఏటా వచ్చిన సగటు పెట్టుబడి రూ.15 వేల కోట్లు. ఈ కాలంలో
కోవిడ్ వల్ల దాదాపు రెండేళ్లు పోయాయి. అవే కాకుండా మరో రూ.1.70 లక్షల కోట్ల
ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఇది వాస్తవం. ఇటీవలే రూ.2 వేల కోట్లకు
ఎంఓయూ. కాకినాడ వేదికగా గ్రీన్ ఎనర్జీ సెజ్ ఏర్పాటు కోసం ఒప్పందం
చేసుకున్నామని వెల్లడించారు. ఇక్కడ ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతుంటే దావోస్
సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం రాలేదని దుష్ప్రచారం చేస్తున్నారు.
విజయవాడలో ఫోర్ ట్వంటీ అయిన మాజీ ఎమ్మెల్యే నాపై పిచ్చి విమర్శలు చేశారు.
పొరుగు రాష్ట్ర పరిశ్రమల మంత్రి దావోస్ పర్యటనలో ఉంటే, నేను కోడి పందాలు,
రికార్డింగ్ డ్యాన్స్‌ల్లో పాల్గొన్నానని. అదెక్కడో ఆ ఫోర్ ట్వంటీ చెప్పాలి.
అలాంటి పనికి మాలిన వారి విమర్శలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.