28 వ డివిజన్ 204 వ సచివాలయ పరిధిలో ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం
ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 28 వ డివిజన్ 204 వ వార్డు సచివాలయ పరిధిలో
వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి కనపర్తి కొండలరావుతో కలిసి మంగళవారం గడప
గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శివాలయం వారి వీధి, వందనపు వారి
వీధి, ఆచార్య వీధి, స్వర హాస్పిటల్ రోడ్డులో విస్తృతంగా పర్యటించి 255 గడపలను
సందర్శించారు. నాలుగేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి
చేకూరిన మేలును గడప గడపకు వెళ్లి వివరించారు. వారి దృష్టికి వచ్చిన సమస్యలను
పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు సూచించారు. అభివృద్ధి, సంక్షేమం బాటలో
పయనిస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి పాలన
జాతీయస్థాయిలో ఎందరో నాయకులకు ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు
అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
శ్వేతపత్రం ప్రకటించే దమ్ముందా..?
తెలుగుదేశం హయాంలో ఆడపడుచులకు అందించిన సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేసే
దమ్ముందా..? అని ప్రతిపక్ష నేత చంద్రబాబును మల్లాది విష్ణు ప్రశ్నించారు. మహిళ
సంక్షేమంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీ పడే రాజకీయ పార్టీ దేశంలోనే
మరొకటి లేదని చెప్పుకొచ్చారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తామంటూ 2014 లో
అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాటతప్పి మోసం చేయడంతో.. ఏ గ్రేడ్ గ్రూపులన్నీ
ఆర్థిక క్రమశిక్షణ కోల్పోయి డి గ్రేడ్ లోకి పడిపోయాయని గుర్తుచేశారు. కనుకనే
అక్కచెల్లెమ్మలందరూ ‘నిన్ను నమ్మం బాబు’ అంటూ 2019 లో గట్టిగా బుద్ధి
చెప్పారని మల్లాది విష్ణు అన్నారు. కానీ సీఎం వైఎస్ జగన్ ఒకే ఒక్క నిర్ణయంతో
78 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నాలుగు విడతలలో రూ. 26 వేల కోట్ల
రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పారు. కాబట్టే ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్నది
ప్రజల గుండె చప్పుడుగా మారిపోయిందని తెలిపారు.
మాయనాడు వేదిగా బూటకపు హామీలు
వంద మహానాడులు నిర్వహించినా చంద్రబాబు బూటకపు మాటలు, కాపీ మేనిఫెస్టోలను
ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి పదవి
లేకపోతే చంద్రబాబు భరించలేరని.. అందుకోసం ఎన్ని అబద్ధాలు ఆడేందుకైనా
వెనకాడబోరని విమర్శించారు. అధికారంలోకి వస్తే పేదలను కోటీశ్వరులను
చేస్తానంటున్న చంద్రబాబు.. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంత
మంది పేదల్ని కోటీశ్వరులను చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా
మద్ధతుతో బలమైన నాయకుడిగా ఎదిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని
ఒంటరిగా ఎదుర్కొనే సత్తా.. రాష్ట్రంలో ఏఒక్క రాజకీయ పార్టీకి లేదని మల్లాది
విష్ణు వ్యాఖ్యానించారు. కనుకనే సిద్ధాంతాలను పక్కనపెట్టి.. వైఎస్సార్ సీపీని
ఎలాగైన ఢీ కొనాలనే సింగిల్ అజెండాతో పనిచేస్తున్నాయన్నారు. మరోవైపు 151
అసెంబ్లీ స్థానాలను ఒంటిచేత్తో గెలిపించుకున్న సీఎం జగన్ ని.. పోటీ చేసిన ఒక్క
స్థానంలోనూ ఘోర పరాజయం పాలైన నారా లోకేష్ సవాల్ చేయడం హాస్యాస్పదమని మల్లాది
విష్ణు అన్నారు. ఇకనైనా లోకేష్ స్థాయిని తెలుసుకోవాలని హితవు పలికారు.
కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, సీడీఓ జగదీశ్వరి, నాయకులు బెజ్జం రవి,
దోనేపూడి శ్రీనివాస్, శనగవరపు శ్రీనివాస్, కమ్మిలి రత్న, కోలా నాగాంజనేయులు,
గుండె సుందర్ పాల్, చిన్నారావు, సాంబయ్య, కగ్గా పాండు, స్టెప్ శ్రీను,
రాజశేఖర్, శ్యామల, యక్కల మారుతి, కోలవెన్ను కొండా, భోగాది మురళి, రత్నాకర్,
చల్లా సుధాకర్, ప్రయాగ కృష్ణ, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది
పాల్గొన్నారు.