న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తోందని , ఇప్పటివరకూ
రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయని
ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు
సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదని వీటిపై వెంటనే
దృష్టిసారించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. శుక్రవారం పార్లమెంటులోని
ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్
రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రస్తావించిన
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ
కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారని, ఈ కమిటీ ఇప్పటికే పలు
దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించిందన్నారు. కీలక అంశాలన్నీ ఇంకా
పెండింగులోనే ఉన్నాయన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నానని, 2014–15
ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625
కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయన్నారు. రీసోర్స్ గ్యాప్ ఫండింగ్
చేస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రభుత్వం చెప్పిందని, ఈ నిధులను
వెంటనే విడుదల చేయాలని సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సంకల్పంతో ముందుకు
సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేదిశగా ప్రాజెక్టు
నిర్మాణాన్ని సాగిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయలో కేంద్రం ప్రభుత్వం తగిన సహకారం
అందిస్తే కొద్దికాలంలోనే ఇది వాస్తవరూపంలోకి వస్తుంది. ఫలితాలు ప్రజలకు
అందుతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాను సొంతంగా
సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు
సంవత్సరాలుగా ఇవి పెండింగ్లో ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా
తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధాన మంత్రిని కోరారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను
టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది.
రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం
హామీ ఇచ్చిందని, దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు
లభిస్తాయని, ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందన్నారు. పెద్ద
ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా సేవారంగం విస్తరిస్తుందని, స్వయం శక్తి దిశగా
రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని
విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం.
ప్రతిజిల్లాకు సుమారుగా 18లక్షలమంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరు
చేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12
కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరారు. ఈ కాలేజీలకు
సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయని, వీటికి సంబంధించి
కేంద్రం తగిన విధంగా సహాయపడాలని విజ్ఞప్తి చేశారు.