గుంటూరు : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఓ వైపు పని కోరిన
గ్రామీణ కుటుంబాలకు పని కల్పిస్తూ, మరోవైపు మెటీరియల్ నిధులను సద్వినియోగ
పర్చుకుంటూ భవన నిర్మాణాలను చేపడుతున్నామని, పనితీరులో దేశంలోనే రెండో
స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి
చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
బూడి ముత్యాల నాయుడు అన్నారు. గురువారం పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ
కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా
పాల్గొని ప్రసంగించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో వేల సంఖ్యలో గ్రామ సచివాలయాలు,
ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, పాల శీతలీకరణ కేంద్రాలు, సిసి, బిటి
రోడ్లు, గ్రావెల్ రోడ్లు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మాణాలు పూర్తి
చేసుకుని గ్రామీణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి పర్చుకున్నామని, వీటికి
సంబంధించిన చెల్లింపులు అన్ని త్వరలోనే జరుగుతాయని అంటూ ఇందుకు అవసరమైన చర్యలు
తీసుకోవాలని మంత్రి ముత్యాల నాయుడు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను కోరారు.
అలాగే గడ్డి పెంపకం వంటి రైతులకు ఉపయోగపడే పనులపై దృష్టి సారించాలని, కేంద్ర
గ్రామీణాభివృద్ధి శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి నిధులు వచ్చేలా చేసి
పథకం అమల్లో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచిన అధికారులను ఆయన అభినందించారు.
అలాగే ఉపాధి హామీ అమలు తీరును ప్రతిబింబి౦చే 7 రిజిష్టర్లను సక్రమంగా
నిర్వహిస్తున్నారని చెప్తూ, ఉపాధి హామీ మండలి సభ్యుల సూచన మేరకు పథకాన్ని
వ్యవసాయంతో అనుసంధానించేలా కేంద్రానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని ఉప
ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు
అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్
మాట్లాడుతూ ఉపాధి హామీ మండలి సభ్యులు ఎప్పటికప్పుడు క్షేత్ర పర్యటనలు చేస్తూ
అనేక అంశాలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారని, ఆయా జిల్లాల పిడి, డ్వామాలకు
క్షేత్ర సంబంధ సమస్యలను తెలియజెప్పి పరిష్కారమయ్యేలా చేశారని అన్నారు.
రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందాలన్ని ఉపాధి హామీ పథకం అమలుపై ప్రసంశలు
కురిపించారని అంటూ ఎటువంటి సమస్యలు లేకుండా పథకం అమలవడంలో మంత్రి బూడి ముత్యాల
నాయుడు గారి పాత్ర ప్రసంశనీయమని అన్నారు. క్రమేణా కేంద్ర నిధుల్లో కూడా
కోత పడుతోందని, ప్రారంభంలో 14 కోట్ల పనిదినాలే కేటాయించినప్పటికి క్రమంగా 23
కోట్ల పనిదినాలకు పెంచిందని ఇప్పటికే 23.05 కోట్ల పనిదినాలను పూర్తి
చేసుకున్నామని, అన్ని సూచికలలో రాష్ట్ర పనితీరు బాగుందని స్వయంగా కేంద్ర
గ్రామీణాభివృద్ధి శాఖే చెప్పిందనే అంశాలను కౌన్సిల్ దృష్టికి కమిషనర్ తీసుకు
వచ్చారు.