అమరావతి : పాలనా భాషగా తెలుగును అన్ని శాఖల్లోను పూర్తిగా అమలు చేసే విధంగా తనవంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయ బాబు స్పష్టం చేశారు. గురువారం అమరావతి సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు భాషా సంఘం అధ్యక్షులుగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పి.విజయబాబుచే భాషా సంఘం అధ్యక్షనిగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ తెలుగు వారందరూ తెలుగుతోపాటు ఆంగ్ల భాషలో కూడా ఉభయ భాషా ప్రవీణులుగా అభివృద్ధి చెందేలా తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
తెలుగు అకాడమీ,ప్రెస్ అకాడమీల సహకారంతో రానున్నరోజుల్లో తెలుగు భాష అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేయనున్నట్టు చెప్పారు.తనను రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు విజయబాబు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు సహకారంతో తెలుగు భాషను మరింత సులభతరం చేసి విస్తృత పర్చేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేస్తానని రాష్ట్ర భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు స్పష్టం చేశారు. ఇందుకు గాను త్వరలో రాష్ట్ర ఐటి శాఖ అధికారులతో సమావేశం కానున్నట్టు వి.జయబాబు తెలిపారు. తెలుగు భాషను సులభంగా ప్రతి ఒక్కరూ నేర్చుకునే రీతిలో తగిన చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు.
ప్రవాసాంధ్రుల పిల్లలు సహితం తెలుగును సక్రమంగా నేర్చుకునే విధంగా తగిన చర్యలు తీసుకోనున్నటు పేర్కొన్నారు. సమాజంలో తెలుగు భాషపై అభిమానం ఉన్నప్రతి ఒక్కరి సహకారం తీసుకుని రానున్న రోజుల్లో తెలుగు భాష అభివృద్ధికి వికాసానికి అన్నివిధాలా ప్రయత్నం చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రపంచీకరణ నేపధ్యంలో అన్ని చోట్ల రాణించాలంటే మాతృ భాషతోపాటు ఆంగ్లభాష తప్పనిసరని అందుకే రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుండే ఆంగ్ల బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుందని విజయబాబు గుర్తు చేశారు. తాను సమాచార హక్కు చట్టం కమీషనర్ గా ఉండగా దేశంలోనే అత్యధిక కేసులు పరిష్కరించిన కమీషనర్లలో రెండవ వానిగా నిలిచినట్టు తెలుగు భాషా సంఘం అధ్యక్షులు విజయ బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు అకాడమీ అధ్యక్షురాలు ఎన్.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ సరైన వ్యక్తికి సరైన పదవి అన్నరీతిలో ముఖ్యమంత్రి విజయబాబుకు తెలుగు భాషా సంఘానికి అధ్యక్షునిగా నియమించడం అభినందనీయమని పేర్కొన్నారు.
తెలుగు భాషపై అభిమానం ఉన్నందునే పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టినప్పటికీ 1వ తరగతి నుండి తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలని ఆదేశించారని చెప్పారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు భాషా సంఘం ఏర్పాటుతో మాతృ భాషా వికాసానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలుగు భాష అభివృద్ధికి భాషా సంఘం అధ్యక్షుల వారి నేతృత్వంలో మరింత కృషి జరగనుందని పేర్కొన్నారు. తొలుత ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్.మల్లిఖార్జున స్వాగతం పలుకగా కార్యక్రమంలో మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర నవరత్నాలు అమలు కమిటీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు ఎ.నారాయణమూర్తి, సమాచార హక్కు చట్టం కమీషనర్లు బివి.రమణ కుమార్, ఐలాపురం రాజా, ఆర్టీఐ కార్యదర్శి సాంబశివరావు, ఎంఎల్సి అప్పిరెడ్డి, ఆర్టీఐ తొలి విశ్రాంత కమీషనర్ అంబటి సుబ్బారావు తోపాటు పలువురు రచయితలు, న్యాయవాదులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.