హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తూ మృతి చెందిన
వేద సాయిచంద్ భార్య రజనిని ఆ పదవిలో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసింది. సాయిచంద్, ములుగు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్‌ల కుటుంబాలకు
రూ. 3 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో
వెల్లడించారు. ‘సాయిచంద్, జగదీశ్‌ల ఆకస్మిక మరణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను
తీవ్రంగా కలచివేసింది. సాయిచంద్ భార్యకు గిడ్డంగుల సంస్థ (వేర్‌హౌసింగ్
కార్పొరేషన్) ఛైర్పర్సన్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
ఇరువురి కుటుంబాలకు రూ. 1.50 కోట్ల చొప్పున సాయం అందిస్తాం. ఇందుకోసం
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఒక నెల జీతాన్ని విరాళంగా
ఇవ్వాలని నిర్ణయించాం. పిల్లల చదువులకు, సాయిచంద్, జగదీశ్ తల్లిదండ్రుల
పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తాం. పార్టీ కోసం పని చేస్తున్న వారిని అందరం
కలిసికట్టుగా ఆదుకుంటామని చెప్పేందుకే విరాళాల ద్వారా సహాయం చేయాలని
నిర్ణయించాం. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా నాయకత్వం అండగా
ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు.