ఢిల్లీ కేంద్రంగా జరిగిన సమావేశంలో అవార్డుల ప్రకటన
విజయవాడ : గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పొదుపు సంఘాల మహిళలకు
బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించడమే కాకుండా ఆయా కుటుంబాలు
ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అలుపెరుగని కృషి చేస్తున్న రాష్ట్రప్రభుత్వం
వివిధ విభాగాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 2 గోల్డ్, మూడు సిల్వర్ స్కోచ్
అవార్డులను గెలుచుకుంది. సోమవారం ఢిల్లీలో స్కోచ్ గ్రూప్ వారు నిర్వహించిన
జాతీయస్థాయి సమ్మిట్ లో వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన ప్రాజెక్టులకు
అవార్డులు ప్రధానం చేయడం జరిగింది.
ఎస్ హెచ్ జీ బ్యాంక్ లింకేజీకి గోల్డ్ అవార్డు:
పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణాలు అందించడంతో పాటు
వారు ఆ రుణాలను స్వదినియోగం చేసుకొని కుటుంబ ఆదాయాలను పెంచుకోవడానికి రాష్ట్ర
ప్రభుత్వం వివిధ రూపాల్లో అందజేస్తున్న సహాయ సహకారాలకుగాను ప్రతిష్టాత్మక
స్కోచ్ సంస్థ స్కోచ్ ప్రకటించిన గోల్డ్ అవార్డును సెర్ప్ సీఈవో ఇంతియాజ్
మహ్మద్, డీ జీ ఎం మొత్తంశెట్టి కేశవ కుమార్ అందుకున్నారు.
స్త్రీనిధికి గోల్డ్ అవార్డు:
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు అనుబంధంగా పనిచేస్తున్న‘ స్త్రీనిధి
’ సంస్థ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు తోడు పొదుపు సంఘాల మహిళలకు అదనంగా,
అత్యంత సులభ విధానంలో 48 గంటల్లో బ్యాంకు రుణాలను అందజేస్తున్నందుకు
స్ట్రీనిధికి గోల్డ్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డ్ ను స్త్రీనిధి
మేనేజింగ్ డైరెక్టర్ కె.వి నాంచారయ్య, డిప్యూటీ జీఎం సిద్ది శ్రీనివాస్
అందుకున్నారు.
మహిళా నవోదయానికి సిల్వర్ అవార్డు:
మహిళా పొదుపు సంఘాల విజయగాథలను ‘మహిళా నవోదయం’ పేరుతో ప్రతి నెలా ప్రత్యేక మాస
పత్రిక రూపంలో ప్రచురించడంపై చిత్తూరు జిల్లా డీఆర్డీఏ విభాగానికి ప్రత్యేక
సిల్వర్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును చిత్తూరు జిల్లా ప్రాజెక్టు
డైరెక్టర్ శ్రీమతి తులసి అందుకున్నారు.
నెల్లూరు డీఆర్డీఏకు సిల్వర్ అవార్డు:
పొదుపు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో మహిళలు పెద్ద ఎత్తున నాటు కోళ్ల పెంపకం
ద్వారా అధిక ఆదాయం పొందుతున్న తీరుపై నెల్లూరు జిల్లా డీఆర్డీఏకు విభాగానికి
సిల్వర్ అవార్డు వరించింది. ఈ అవార్డును ప్రాజెక్టు డైరెక్టర్ సాంబశివరెడ్డి
అందుకున్నారు.
చిత్తూరు డీఆర్డీఏకు సిల్వర్ అవార్డు:
నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల నిర్వహించడంలో
ప్రత్యేక చొరవ తీసుకుంటున్నందుకు చిత్తూరు డీఆర్డీఏకు సిల్వర్ అవార్డు
దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా
వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా
మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందజేస్తోంది. తద్వారా మహిళలు ఆర్థికంగా తమ
కాళ్ల మీద తాము నిలదొక్కుకుంటున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని
లాభధాయక కార్యక్రమాలు కొనసాగిస్తూ సకాలంలో రుణాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం
అందజేసే ప్రోత్సాహకాలతో గ్రామీణాభివృద్ధి శాఖకు 5 స్కోచ్ అవార్డులు దక్కడం
అభినందనీయం.