అణగారిన వర్గాల సామాజిక ఆర్ధికాభివృద్దే లక్ష్యంగా ప్రణాళికాబోర్డు పనిచేస్తుంది
గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నవరత్నాలు సక్రమ అమలుకు కృషి
ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు
అమరావతి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రణాళికా బోర్డు పనిచేస్తుందని రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్టు పేర్కొన్నారు.శుక్రవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో ఆయన వేద పండితుల ఆశ్వీర్వచనాలు మరియు గన్నవరం శ్రీభువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ దివ్య ఆశీస్సులతో ఆయన నూతన చాంబరులో ప్రవేశించి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు.ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ప్లానిగ్ బోర్డు ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అణగారిన వర్గాల సామాజిక ఆర్ధికాభ్యున్నతే ధ్యేయంగా ప్లానింగ్ బోర్డు పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యంగా నవరత్నాల పధకాలను ప్రణాళికాబద్ధంగా విజయవతంగా అమలు చేసి ఆయా పధకాల ప్రయోజనాలు ప్రతి లబ్దిదారునికి అందేలా ప్లానిగ్ బోర్డు కృషి చేస్తుందని పేర్కొన్నారు.
అదే విధంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు తనవంతు కృషి చేస్తానని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్టు స్పష్టం చేశారు.
జాతిపిత మహత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా పేదరిక నిర్మూనలకు ప్రభుత్వం అమలు చేస్తున్ననవరత్నాలు పధకాలను,ఇతర అభివృద్ది సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేసేందుకు ప్రణాళికా బోర్డు ప్రయత్నం చేస్తుందని ఉపాధ్యక్షులు మల్లాది విష్టు పేర్కొన్నారు.వివిధ అభివృద్ధి పధకాలు అమలులో ఆర్ధికాభివృద్ధి స్థాయిలను పర్యవేక్షించడం తోపాటు వాటి మూల్యాంకనం చేయడంలో రాష్ట్ర ప్రణాళికా బోర్డు కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు.అంతేగాక వివిధ పధకాల సక్రమ అమలు చేయడం,ప్రణాళిక అమలులో ప్రతి దశలో సాధించిన ప్రగతిని ఎప్పటికప్పుడు నిర్ధారించడంతో పాటు ఆయా విధానాలు సర్దుబాట్లకు వీలుగా ఆయా శాఖలు,విభాగాలకు ప్రణాళికాబోర్డు తగిన సూచనలు,సలహాలను అందిస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల సమగ్రాభివృద్ధికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు సకాలంలో రాబట్టేందుకు ప్రణాళికా బోర్డు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి శాసన సభ్యునికి 2కోట్ల రూ.లు వంతున విడుదల చేసే నిధులతో చేపట్టే పనుల పర్యవేక్షణను చూస్తుందని ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్టు పేర్కొన్నారు.అంతేగాక రాష్ట్రంలో వ్యవసాయం,విద్య,వైద్య,ఇంధన,మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశాల్లో ప్రణాళికాబోర్డు ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వివిద అంశాలను ఈప్రభుత్వం ముందుకు తీసుకువెళుతూ అన్ని అభివృద్ధి సంక్షేమ పధకాలను ఒక ప్రణాళికాబద్దంగా అమలు చేయండం ద్వారా పేదరిక నిర్మూలనే అంతిమ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్ష్యులు మల్లాది విష్టు పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖామాత్యులు జోగి రమేశ్,శాసన సభ మాజీ ఉప సభాపతి కోన రఘుపతి,రాష్ట మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి,రాష్ట్ర ప్రణాళికా శాఖకు చెందిన పలువులు అధికారులు,విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్టుకు పూల గుచ్చాలు అందించి శుభా కాంక్షలు తెలియజేశారు.