విజయవాడ : జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐటీ రంగానికి
అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా నాలుగేళ్లలో ఐటీ ఎగుమతులు 34% పెరిగాయని, రూ.
240 కోట్ల నుంచి రూ.677 కోట్లకు చేరాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా
బుధవారం పలు అంశాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో
ఐటీ రంగం గణనీయమైన వృద్ధి సాధించిందని అన్నారు. పలు దిగ్గజ కంపెనీలు తమ
కార్యకలాపాలను రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని, విశాఖతో పాటు ద్వితీయ శ్రేణి
పట్టణాల పైనా దృష్టిసారిస్తున్నాయని ఆయన తెలిపారు.
వికేంద్రీకరణతో రాష్ట్ర నలుమూలలా అభివృద్ధి
రాష్ట్ర నలుమూలలా అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నినాదమని ఈ మేరకు
ఆయన తలపెట్టి చేపట్టిన వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి
సాధ్యపడుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. మూలపేట పోర్టు, కాకినాడ పోర్టు,
మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు లతో రాష్ట్రంలో అన్ని నలుమూలలా అభవృద్ది
సాధ్యపడుతుందని అన్నారు.
వరుసగా నాలుగోసారి జగనన్న అమ్మ ఒడి
విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
దేశానికే ఆదర్శంగా నిలస్తోందని ఈ మేరకు అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో
వరుసగా నాలుగో ఏడాది కూడా నగదు జమచేశారని విజయసాయి రెడ్డి అన్నారు. 42,61,965
మంది తల్లుల ఖాతాల్లో రూ.6,393 కోట్లు జమచేశారని అన్నారు. ఇప్పటివరకు ఒక్క
అమ్మ ఒడి పథకం కిందే రూ.26068 కోట్లు ఖర్చ చేశారని, నాలుగేళ్లలో విద్యారంగంపై
66,722 కోట్లు ఖర్చు చేశారని వివరించారు.
విపక్షానిది బుదర రాజకీయం
ఇంట్లో భార్యాభర్తలు పోట్లాడుకున్నా- వీధిలో కుక్క మొరిగినా-మురుగు కాలువలో
పందిపొర్లినా వాటిని వైఎస్సార్సీపీకి అంటగట్టి విపక్షం ఓ వర్గం మీడియా
సహాకారంతో నేరాంధ్ర అంటూ బురద రాజకీయం చేస్తోందని విజయసాయి రెడ్డి
మండిపడ్డారు. అందుకే ఏపీలో ప్రతిపక్షం టీవీ స్టూడియోల్లో తప్ప ప్రజల్లో
కనిపించడం లేదని అన్నారు.