విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో 26 జిల్లాల్లోని ఉద్యోగులూ
తీవ్ర ఆందోళనతో ఉన్నారని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
అన్నారు. ప్రభుత్వం ఇచ్చే హామీలను ఉద్యోగులు నమ్మేస్థితిలో లేరని చెప్పారు.
విజయవాడలోని ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం వద్ద ఏపీ ఐకాస
అమరావతి ఉద్యోగులు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ గతంలో
పేర్కొన్న విధంగా ఉద్యమ కార్యాచరణ ప్రకారమే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 20 వరకు
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆందోళన కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర నాయకత్వం
నచ్చజెప్పినా ఉద్యోగులు అంగీకరించడం లేదని, తిరిగి తమపై ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారని బొప్పరాజు అన్నారు. ప్రభుత్వం జీతాలే చెల్లించలేని
పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గితే బకాయిలు
ఇస్తుందనే నమ్మకం లేదని చెప్పారన్నారు. ఉద్యమాన్ని కొనసాగించాలని, అవసరమైతే
కార్యాచరణను తీవ్రతరం చేయాలనే సూచనను రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో
వ్యక్తమైందని ఆయన తెలిపారు.అందుకే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఈనెలాఖరులోపు చట్టబద్ధంగా తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్
చేశారు.