హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆదివారం ఆమోదముద్ర వేయనుంది.
శాసనసభ ఎన్నికల ఏడాది వేళ మరోమారు భారీ పద్దుకు సర్కార్ సిద్ధమవుతోంది.
ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు పెద్దపీట వేస్తూనే హామీల అమలు, ఓటు బ్యాంకును
దృష్టిలో పెట్టుకోనున్నారు. కేంద్రం నుంచి పన్నుల్లో వాటా, ప్రాయోజిత పథకాలు
మినహా అదనపు నిధులు వచ్చే అవకాశం లేదని తేలింది. ఈ నేపథ్యంలో సొంత పన్నులు,
ఇతర మార్గాలపైనే రాష్ట్రం ఎక్కువగా ఆధారపడనుంది. వచ్చే వార్షిక సంవత్సరానికి
రాష్ట్ర బడ్జెట్ రూ.మూడు లక్షల కోట్లకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన
ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయడమే ఎజెండాగా
మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక
ప్రణాళికపై సమావేశంలో చర్చించనున్నారు. ఇదే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ
దఫాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. ప్రస్తుతం నడుస్తున్న 2022-23 సంవత్సరానికి రాష్ట్ర
ప్రభుత్వం భారీ అంచనాతో రూ.2 లక్షలా 52 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
ఈ ఏడాది లక్షా 93 వేల 29 కోట్ల రెవెన్యూ రాబడులు అంచనా వేయగా డిసెంబర్ చివరి
నాటికి అంచనాలకు అనుగుణంగానే ఖజానాకు సమకూరాయి.
రుణాలకు సంబంధించి కేంద్రం ఆంక్షలు
కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో మాత్రం ఈ ఏడాది బాగా కోతపడింది. కేంద్ర
పన్నుల్లో వాటా, కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులు మాత్రమే వస్తున్నాయి.
గ్రాంట్లను భారీగా అంచనా వేసినప్పటికీ రాష్ట్రానికి ఇప్పటికి వచ్చింది చాలా
తక్కువే. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ల మొత్తం దాదాపు 60 వేల కోట్లు అంచనా
వేయగా డిసెంబర్ నెల వరకు వచ్చింది 16 వేల కోట్లు వచ్చాయి. ప్రత్యేకించి
గ్రాంట్ల విషయంలో సర్కార్ అంచనాలు భారీగా తప్పాయి. 41 వేల కోట్లు అంచనా వేస్తే
డిసెంబర్ నెలాఖరు వరకు కేవలం 7 వేల 770 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర
ప్రభుత్వం తీసుకునే రుణాలకు సంబంధించి కూడా కేంద్రం ఆంక్షలు
విధించింది.ఎఫ్ఆర్బీఎంకు లోబడి ఏడాది 52 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని రాష్ట్ర
ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించినప్పటికీ కేంద్రం ఆ మొత్తానికి అనుమతి
ఇవ్వలేదు. కేవలం 37 వేల కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అభివృద్ధి
కార్యక్రమాలకు కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులకు కూడా ఆటంకం కలిగింది.
డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం లక్షా 24 వేల కోట్లకు పైగా వ్యయం
చేసింది. చివరి త్రైమాసికంలో వ్యయం ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా. ఆర్థిక
సంవత్సరం ముగిసే నాటికి వ్యయం రెండు లక్షల కోట్ల వరకు చేరుతుందని అంచనా
వేస్తున్నారు.