నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ దీక్ష
హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు
చేయటాన్ని నిరసిస్తూ ఆ పార్టీ రోడ్డెక్కింది. సేవ్ డెమోక్రసీ అంటూ ఇప్పటికే
వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న హస్తం పార్టీ ఇవాళ హైదరాబాద్
గాంధీభవన్ వద్ద దీక్ష చేపట్టనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు
తరలివచ్చి.. దీక్షలో పాల్గొనాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పట్ల నరేంద్ర మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న
తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు
ఇవాళ హైదరాబాద్ గాంధీభవన్‌లో నిరసన దీక్ష చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు
రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో
ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
దీక్ష నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
రాహుల్‌పై కుట్రపూరితంగా అనర్హత వేటు
అంతకుముందు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల
బాధ్యుడు మాణిక్‌రావ్ ఠాక్రేతో రేవంత్, ఉత్తమ్ సమావేశమై తాజా పరిణామాల వేళ
చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, అదానీ
వ్యవహారంపై పార్లమెంటు వేదికగా పదే పదే ప్రశ్నిస్తున్నందుకే రాహుల్‌పై
కుట్రపూరితంగా వేటు వేశారని రేవంత్ మండిపడ్డారు.
రాహుల్‌కు భయపడే ఈ చర్యలు
జగిత్యాల తహసీల్దార్ చౌరస్తాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో హస్తం
శ్రేణులు ధర్నా చేశాయి. కరీంనగర్ జిల్లా గంగాధరలో కరీంనగర్, జగిత్యాల జాతీయ
రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రిలో రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్
నాయకులు నిరసన తెలిపారు. ఖమ్మం పాత బస్టాండ్ కూడలిలో బీజేపీకి వ్యతిరేకంగా
నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాహుల్‌పై అనర్హత వేటును
నిరసిస్తూ ప్రధాని, అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుమురం భీం
జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాహుల్‌కు భయపడే
మోదీ, అమిత్‌షాలు రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని
ఆరోపించారు.రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సరైన చర్య కాదంటున్న కాంగ్రెస్
శాంతియుత మార్గంలో ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించినట్లు పార్టీ
వర్గాలు తెలిపాయి. ప్రజలకు కానీ, ప్రభుత్వ ఆస్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు
కలగకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టడం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం
ద్వారా ఒత్తిడి పెంచనుంది.