మోడీ అనే ఇంటిపేరును ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యలు
రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు
ప్రజాస్వామ్యానికి ఘోరీ కట్టారన్న జైరాం రమేశ్
న్యూఢిల్లీ : మోడీ అనే ఇంటిపేరును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఎంపీగా
అనర్హత వేటుకు గురికావడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన
కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ స్పందించారు. రాహుల్ పై అనర్హత
నిర్ణయాన్ని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. అదానీ
కుంభకోణంపై జేపీసీ వేయాల్సింది పోయి, రాహుల్ పై అనర్హత వేటు వేశారని
విమర్శించారు. ప్రజాస్వామ్యానికి సమాధి కట్టారని మండిపడ్డారు. ఈ పరిణామంతో
బెదిరిపోమని, తప్పనిసరిగా ఎలుగెత్తుతామని జైరామ్ రమేశ్ ట్విట్టర్ లో స్పష్టం
చేశారు. అటు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే కూడా రాహుల్ కు మద్దతుగా
నిలిచారు. దేశంలో దొంగను దొంగ అనడం నేరంగా మారిందని పేర్కొన్నారు.
దోపిడీదారులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, రాహుల్ పై మాత్రం వేటు వేశారని
విమర్శించారు. రాహుల్ పై వేటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు.