విశాఖపట్నం : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పెట్టుబడిదారుల నుంచి వచ్చిన
స్పందనే తమ ప్రభుత్వ పారిశ్రామిక విధానమని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
కేవలం సంవత్సరం, రెండు సంవత్సరాల్లోనే సాకారమయ్యేలా ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు
ఆయన వెల్లడించారు. రికార్డు స్థాయిలో తొలి రోజు రూ.11.87 లక్షల కోట్ల
పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఈ రెండు రోజుల సదస్సు ద్వారా రూ.13 లక్షల
కోట్ల పెట్టుబడులు తీసుకువస్తున్నామని గర్వంగా చెబుతున్నామన్నారు. వీటి ద్వారా
6 లక్షల మందికి ఉపాధి అవకాశాలుంటాయన్నారు. కేవలం సీఎం జగన్ బ్రాండ్ వల్లే
ఏపీకి ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టంచేశారు. 14 రంగాలలో ఫోకస్
చేద్దామనుకున్నప్పటికీ 20 రంగాలలో పెట్టుబడులు వచ్చాయి. దేశ, విదేశాల
ప్రముఖులకు తమ ప్రభుత్వం ఇచ్చిన నమ్మకం వల్లే పెట్టుబడుల ప్రవాహం వచ్చింది.
ఏపీకి సహజ వనరులు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర అభివృద్దికి సీఎం వైఎస్ జగన్
నిరంతరం కృషి చేస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి రెండో రోజు సదస్సు
ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
ఏపీకి వచ్చిన పెట్టుబడులపై ఫాలో అప్ ఉండాలని సీఎం జగన్ సూచించారు.
ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగింది. కోవిడ్ వల్ల రెండేళ్ల పాటు ఈ తరహా
సమావేశాలు నిర్వహించలేకపోయాం. టీడీపీ హయాంలో చేసుకున్న ఎంఓయూలలో పది శాతం
మాత్రమే ప్రారంభమైతే సీఎం జగన్ హయాంలో ఇప్పటి వరకు 80 నుంచి 90 శాతం
ప్రారంభమయ్యాయి. ఈ సమ్మిట్ లో చేసుకున్న ఎంఓయూలు నూరు శాతం ప్రారంభమవుతాయని
అమర్నాథ్ పేర్కొన్నారు. అలాగే సమ్మిట్‌పై టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై
అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అచ్చెన్నాయుడు ఇపుడే నిద్రలేచారా?.
అంబానీ, అదానీ, దాల్మియా, బజాంకాలని ఆయన ఎపుడైనా చూశాడా?. ఈ సమ్మిట్‌కు వచ్చిన
అనూహ్య స్పందనపై ప్రశంసించకపోయినా పర్వాలేదు, కానీ తప్పుడు విమర్శలేంటి?’ అంటూ
నిప్పులు చెరిగారు.