గుంటూరు : ఆంధ్రప్రదేశ్ లో నిజమైన అభివృద్ధి అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి చేసి
చూపిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని
స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో కనీసం విజయవాడలో ఫ్లైఓవర్ కూడా పూర్తి
చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు అండ్ కో
దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదని విమర్శించారు. రాజధానిపై ఎల్లో
మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి
మండిపడ్డారు. అమరావతి డిక్లేర్ చేశాక చంద్రబాబు కేంద్రాన్ని సంప్రదించకుండా
అప్పటి మంత్రి నారాయణతో కమిటి వేసి వారంలో రాజధాని ప్రకటించారని గుర్తు
చేశారు. అమరావతిని బంగారు గుడ్డుపెట్టే బాతులా మార్చాలనుకున్నారని సజ్జల
రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా మార్చుకుని
దోచుకున్నారని సజ్జల మండిపడ్డారు. అనాడు సీఎంగా ఉండి చంద్రబాబు రియల్
ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు బినామీల పేరుతో
ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని విమర్శించారు. ఐదేళ్లలో చంద్రబాబు అమరావతిపై
కేవలం రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. టెంపరరీ బిల్డింగ్లు,
సగం రోడ్లు వేసి వదిలేశారన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి అంశంతో చంద్రబాబు
లబ్ధిపొందాలని చూస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఫోన్
ట్యాపింగ్ జరగకపోయినా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలోనే
ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఫోన్ ట్యాపింగ్లు చేశారని నిలదీశారు. సీఎం జగన్
అసెంబ్లీలో మాట్లాడిన మాటలను చంద్రబాబు వక్రీకరిస్తున్నారు. చంద్రబాబు స్థాయి
దిగజారి వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా టీడీపీ దయనీయ స్థితిలో ఉందని.. అందుకే
లేనిపోనివి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలతో మాట్లాడే
పాయింట్లు లేకపోవడంతో టీడీపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం
వ్యక్తం చేశారు.