స్వల్పంగా అప్పుల తగ్గింపు
రానున్న ఆర్థిక సంవత్సరం లక్ష్యం 0.20 శాతం మాత్రమే
బడ్జెట్ సమావేశాలకు ఫిస్కల్ నివేదిక సిద్ధం
అమరావతి : రాష్ట్ర ఖజానాను దారినపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు
ఆర్థికశాఖ చెబుతున్నప్పటికీ ఆశించిన మేర లక్ష్యాలు చేరుకోవడం సందేహాస్పదంగానే
మారింది. బడ్జెట్ సమావేశాల కోసం ఆర్థికశాఖ రూపొందించిన ఫిస్కల్
స్టేట్మెంట్ (ద్రవ్య నివేదిక) ఈ అనుమానాలకు కారణం. ఈ నివేదికలో 2025-26
ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లక్ష్యాలను పొందుపరిచింది.
దీని ప్రకారం రుణభారం నామమాత్రంగానే తగ్గనుండటం చర్చనీయాంశంగా మారింది.
జిఎస్డిపిలో 35 శాతం వరకు రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉండగా, 2021-22 నాటికి
అదే స్థాయిలో తీసుకున్నారు. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 36.30 శాతంగా
అంచనా వేస్తున్నారు. ఇది సంవత్సరాంతానికి మరింత పెరిగే అవకాశాలు
కనిపిస్తున్నాయి. అయితే వచ్చే మార్చి నుంచి ఆరంభమయ్యే ఆర్ధిక సంవత్సరంలో
దీనిని 36.10 శాతానికి తగ్గించాలని నిర్ణయించుకున్నారు. అంటే కేవలం 0.20 శాతం
మాత్రమే తగ్గనున్నాయి. అలాగే 2024-25 నాటికి దీనిని 35.80 శాతానికి
తగ్గిరచుకోవాలని కూడా లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
2022 మార్చికి 3.90 లక్షల కోట్లు
కాగా అధికారిక నివేదిక మేరకు 2022 మార్చి నెలాఖరు వరకు 3,90,670 కోట్లు రుణంగా
ఉన్నట్లు తేలింది. ఇందులో బహిరంగ మార్కెట్ రుణాలే 2,64,837 కోట్ల రూపాయలు
ఉన్నాయి. అంతకు ముందు 2020-21లోరూ 3,50,556 కోట్లుగా ఉన్నట్లు తేలింది. ఇందులో
మార్కెట్ రుణాలు 2,29,317 కోట్ల రూపాయలు. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థల
ద్వారా తీసుకున్న రుణాలను మాత్రం చూపించలేదు.ఇక లోటు విభాగంలో కూడా లక్ష్యాలు
అంతంతమాత్రంగానే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2021-22లో ద్రవ్య లోటు
ఐదు శాతాన్ని లక్ష్యంగా నిర్ణయించుకోగా, దానిని 3.18 శాతానికి
తగ్గించుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది 4.5 శాతంగా లక్ష్యం
నిర్దేశించుకోగా, 3.64 శాతం వరకు చేరుకుంటామని చెబుతున్నారు. అదే 2023-24,
2024-25 ఆర్థిక సంవత్సరాల్లో నాలుగు శాతానికి లక్ష్యంగా
నిర్దేశించుకుంటున్నారు. ఆదాయ లోటు ప్రస్తుతం 3.33 శాతంగా ఉండగా, 2025-26
నాటికి 2.4 శాతానికి తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు ఆర్థికశాఖ చెబుతోంది.