విజయనగరం : రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రాజాం పట్టణంలో
విజయనగరం – పాలకొండ రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం మంజూరు చేసిన
రూ.20 కోట్లకు అదనంగా మరో రూ.10 కోట్లు కట్టడాలు, భవనాలకు
నష్టపరిహారం చెల్లింపు, తాగునీటి పైపులైన్ల మార్పిడి, విద్యుత్ స్థంభాలు,
లైన్ల మార్పిడి చేసేందుకు అవసరమని గుర్తించామని రాష్ట్ర విద్యా శాఖ
మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ మేరకు అవసరమైన నిధులను
ప్రభుత్వం ద్వారా మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఈ
ప్రాంత ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులతో సంప్రదించి, వారితో
సమన్వయంతో పనిచేయడం ద్వారా రోడ్ల విస్తరణ పనులను సకాలంలో
పూర్తిచేసేందుకు అధికారులు కృషిచేయాలని మంత్రి ఆదేశించారు. రాజాం పట్టణంలో
ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో చేపట్టనున్న నాలుగు కిలోమీటర్ల రోడ్ల విస్తరణ
పనులకు మంత్రి బుధవారం రాజాం పట్టణంలోని డా.బి.ఆర్.అంబేద్కర్ కూడలి
వద్ద శంకుస్తాపన చేశారు. అనంతరం స్థానిక సూర్యదుర్గ కళ్యాణమండపంలో
ప్రజాప్రతినిదులు, జిల్లా అధికారులతో రోడ్డువిస్తరణ పనులపై సమీక్ష
నిర్వహించారు.
రోడ్డు విస్తరణలో భవనాలు, కట్టడాలు కోల్పోయిన వారికి రూ.3 కోట్ల
వరకు చెల్లించాల్సి వుంటుందని, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న వారు పరిహారం
నగదు రూపంలో చెల్లించాలని కోరుకుంటున్నారని పట్టణ ప్రణాళిక అధికారి
మంత్రికి వివరించారు. సమావేశంలో జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి
శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి, ఎం.పి. బెల్లాన
చంద్రశేఖర్, ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎం.ఎల్.సి. పాలవలస విక్రాంత్,
శ్రీకాకుళం జెడ్పీ వైస్ ఛైర్మన్ సిరిపురపు జగన్మోహన్, కళింగ
కార్పొరేషన్ ఛైర్మన్ పేడాడ తిలక్, ఆర్.డి.ఓ. అప్పారావు, గ్రామీణ
నీటిసరఫరా ఎస్.ఇ. ఉమాశంకర్, రోడ్లు భవనాల శాఖ ఇ.ఇ. బి.వి.రమణ,
జె.ఇ. నాగభూషణ్, మునిసిపల్ కమిషనర్ కృష్ణారావు, తహశీల్దార్
విజయభాస్కర్, ఎంపిడిఓ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
రవాణాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్లు భద్రత వారోత్సవాల పోస్టర్లను
మంత్రి, జిల్లా కలెక్టర్ తదితరులు ఆవిష్కరించారు.