వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చాం: మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రూపకల్పన
చాణక్యుడి తరహాలో సీఎం జగన్ పాలిస్తున్నారని ప్రశంస
వెలగపూడి : ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 3.51 శాతం మేర ద్రవ్యలోటు, 1.56 శాతం రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించినా ఏప్రిల్ నుంచి జులై నెలల వరకే ఆమోదం తీసుకుంటారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయం
బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు. బుధవారం అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి బుగ్గన ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్నీ విస్మరించకూడదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐదేళ్ల కిందట తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పాత, మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంబించామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బుగ్గన తెలిపారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు.
బడ్జెట్ స్వరూపం
వార్షిక బడ్జెట్ రూ. 2,86,389.27 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2,30,110.41 కోట్లు
మూలధన వ్యయం రూ. 30,530.18 కోట్లు
రెవెన్యూ లోటు రూ. 24,758.22 కోట్లు
ద్రవ్య లోటు రూ. 55,817.50 కోట్లు
జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం
రెవెన్యూ లోటు 1.56 శాతం