108 సేవలు మరింత బలోపేతం
2020లోనే మండలానికో 108ను సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి : 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం
చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు
చేసింది. ఈ అంబులెన్స్‌లను సోమవారం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్
కార్యాలయం వద్ద ప్రారంభించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం అయిన
108 వ్యవస్థను బలోపేతం చేస్తూ 2020లోనే మండలానికి ఒక 108 అంబులెన్స్‌ను
సమకూర్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అప్పట్లో రూ.96.50 కోట్లతో అధునాతన
సౌకర్యాలతో 412 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసి, అప్పటికే ఉన్నవాటికి
మరమ్మతులు చేసి 748 అంబులెన్స్‌లతో సేవలను విస్తరించారు. గత అక్టోబర్‌లో
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం రూ.4.76 కోట్లతో ప్రత్యేకంగా 20
అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య
768కి చేరింది. ఎక్కువకాలం ప్రయాణించి దెబ్బతిన్నస్థితిలో ఉన్నవాటి స్థానంలో
కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టడం కోసం తాజాగా రూ.34.79 కోట్లతో 146
అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు 108 సేవల కోసం ఏటా
ప్రభుత్వం రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల
ఫలితంగా గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం సేవలు ఎంతో మెరుగుపడ్డాయి.
అప్పట్లో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్స్ ఉండగా ప్రస్తుతం 74,609 మంది
జనాభాకు ఒక అంబులెన్స్ ఉంది.
సేవలు వినియోగించుకున్న 33,35,670 మంది : ప్రస్తుతం రాష్ట్రంలో 108
అంబులెన్స్‌లు రోజుకు 3,089 కేసులకు అటెండ్ అవుతున్నాయి. ఇలా 2020 జూలై నుంచి
ఇప్పటి వరకు 33,35,670 ఎమర్జెన్సీ కేసుల్లో అంబులెన్స్‌లు సేవలందించాయి.
సేవలు వినియోగించుకున్నవారిలో అత్యధికంగా 23%మంది మహిళలే. అనంతరం 12% మంది
కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు, 11% మంది రోడ్డు, ఇతర ప్రమాదాల బాధితులు
ఉన్నారు.