షాబాద్ : ఉత్పాదక రంగంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని, అక్కడికి
వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,
మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. టీఎస్ఐపాస్ విధానం దేశానికే
తలమానికంగా మారిందని, దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని
పేర్కొన్నారు. న రంగారెడ్డి జిల్లా చందనవెళ్లి పారిశ్రామికవాడలో జపాన్‌కు
చెందిన డైఫుక్ ఇంట్రా లాజిస్టిక్ ఇండియా, నికోమాక్ తైకిషాలు సంయుక్తంగా
నిర్మిస్తున్న ఆటోమేటెడ్ ఉత్పత్తుల పరిశ్రమకు భూమిపూజ నిర్వహించారు.
చందనవెళ్లి, సీతారాంపూర్ పారిశ్రామికవాడలలో అమెజాన్, మైక్రోసాఫ్ట్,
వెల్స్పన్, ఎస్టర్, కటేర్రా లాంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే తమ శాఖలను
ఏర్పాటు చేశాయని.. డైఫుక్ వంటి సంస్థ ఇక్కడ రూ.575 కోట్ల పెట్టుబడితో
పరిశ్రమను స్థాపించి సుమారు రెండు వేల మందికి ఉపాధి కల్పించనుందని తెలిపారు.
14 నుంచి 16 నెలల వ్యవధిలో పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించనుందన్నారు. ఈ కంపెనీ
వికారాబాద్‌లోని ఐటీఐని దత్తత తీసుకుందని తెలిపారు. ఇప్పటికే చెన్నై,
పుణెలాంటి నగరాలు జపాన్ పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించాయని, రాష్ట్రం కూడా ఆ
దేశ పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. గతం కంటే భవిష్యత్
బాగుండాలి అనే జపాన్ సూక్తి స్ఫూర్తితో మనం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జపాన్ కాన్సుల్ జనరల్ మసయూకి తాగా, సంస్థ ప్రతినిధులు
శ్రీనివాస్ గరిమెళ్ల, ఆండ్రూసన్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి
జయేశ్‌రంజన్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ
మహేందర్‌రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ అనితారెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ
నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.