రూ.7 వేల కోట్లతో దేశంలోని న్యాయస్థానాలన్నీ అనుసంధానం
సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో అట్టడుగు స్థాయిలోని వారికీ న్యాయాన్ని అందుబాటులోకి
తీసుకురావడమే మన న్యాయవ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాల్ అని ప్రధాన
న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. స్వాతంత్య్ర
దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లోని సర్వోన్నత న్యాయస్థాన ప్రాంగణంలో
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జాతీయ
పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. సుప్రీంకోర్టును రెండు దశల్లో
విస్తరించబోతున్నట్లు ప్రకటించారు. ‘‘భవిష్యత్తు సవాళ్లను దీటుగా
ఎదుర్కోవడానికి న్యాయస్థానాలను ఆధునికీకరించడంలో భాగంగా సుప్రీంకోర్టు
విస్తరణకు ప్రణాళిక రూపొందించాం. మరో 27 కోర్టులు, 4 రిజిస్ట్రార్
కోర్టురూమ్ల నిర్వహణకు అనుగుణంగా కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించాం. ఈ
విస్తరణను 2 దశల్లో చేపడతాం. తొలిదశలో ఇప్పుడున్న మ్యూజియం, అనుబంధ భవనాన్ని
తొలగించి 15 కోర్టుల నిర్వహణకు వీలుగా కొత్త భవనం నిర్మిస్తాం. అందులోనే
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్
కోసం గ్రంథాలయాలు, ఈ రెండు సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శుల కోసం
కార్యాలయాలు, వాటి పదాధికారుల సమావేశాల కోసం గదులు, న్యాయవాదులు, కక్షిదారుల
కోసం క్యాంటీన్ నిర్మిస్తాం. బడ్జెట్‌తో సహా పూర్తిస్థాయి డీపీఆర్ తయారైంది.
ఇప్పుడు అది న్యాయశాఖ చేతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా తగిన
ప్రాధాన్యం ఇస్తుందని ఆశిస్తున్నాను. రెండోదశలో సుప్రీంకోర్టుకు అనుబంధంగా
ఉన్న కోర్టు భవన సముదాయాలను కూల్చివేసి మరో కొత్త భవనం నిర్మిస్తాం. అందులో 12
కోర్టు గదులు, రిజిస్ట్రార్ కోర్టులు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్,
అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్లకు లాంజ్‌లు ఏర్పాటు చేస్తాం. ఈ
కొత్త భవనాలు దేశ ప్రజల ప్రాధాన్యతలు, రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేరుస్తాయని
జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతికత వినియోగం : న్యాయం అందించే క్రమంలో ఎదురవుతున్న అవరోధాలను
అధిగమించడానికి సాంకేతికను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి
ప్రయత్నిస్తున్నట్లు జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ‘‘ఇ-కోర్ట్స్ ప్రాజెక్ట్
మూడో దశను అమలుచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రూ.7వేల కోట్ల బడ్జెట్
కేటాయించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులను అనుసంధానిస్తాం.
న్యాయస్థానాల పనితీరులో విప్లవాత్మక మార్పులు వస్తాయి. కోర్టులను కాగితరహితంగా
మార్చడంతో పాటు, రికార్డులన్నింటినీ డిజిటలీకరిస్తాం. న్యాయవ్యవస్థను తక్కువ
ఖర్చులో అందరికీ అందుబాటులోకి తీసుకెళ్లడం మా లక్ష్యం’ అని తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పులను భారతీయ భాషల్లోకి అనువదించడానికి సుప్రీంకోర్టు
తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఇదే విషయాన్ని జస్టిస్ చంద్రచూడ్ గుర్తు చేస్తూ ఇప్పటివరకు 9,423 తీర్పులను
ప్రాంతీయ భాషల్లోకి అనువదించాం. ఇందులో 8,977 హిందీలోకి తర్జుమా చేశాం.
సుప్రీంకోర్టు ప్రారంభం నుంచి వెలువడిన 35వేల తీర్పులనూ అన్ని భారతీయ
భాషల్లోకి అనువదించాలన్నది మా లక్ష్యం’’ అని తెలిపారు. కేసుల దాఖలు నుంచి
విచారణ వరకు పట్టే సమయాన్ని తగ్గించే విషయంలో కృత్రిమ మేథను ఉపయోగించడానికి
ఉన్న వెసులుబాటు గురించి ఇటీవల మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్లతో చర్చించామన్నారు.
గత మార్చి నుంచి జులై మధ్య కాలంలో 19,273 కేసులు దాఖలుకాగా, 19వేల కేసుల
విచారణ ముగిసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి
అర్జున్‌రామ్ మేఘ్వాల్, అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్
తుషార్‌మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదీష్
సి.అగర్వాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.