రూ.13,41,734 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు
ముగిసిన పెట్టుబడిదారుల సదస్సు
విశాఖపట్నం : రాష్ట్రప్రభుత్వం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్
కళాశాల మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు
ముగిసింది. ఈ సదస్సులో మొత్తం రూ.13,41,734 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 378
ఒప్పందాలు (ఎంఓయూ) చేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం
6,09,868 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. తొలిరోజు రూ.11.85 లక్షల
కోట్ల పెట్టుబడులకు 92 ఎంఓయూలు, రెండోరోజు రూ.1.56 లక్షల కోట్ల పెట్టుబడులకు
286 ఎంఓయూలు చేసుకున్నట్టు వెల్లడించింది. అత్యధికంగా పర్యాటక రంగంలో 117
ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపింది. రెండురోజుల సదస్సులో ముకేశ్ అంబానీ,
కరణ్ అదానీ, నవీన్ జిందాల్, అర్జున్ ఒబెరాయ్, కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల,
గ్రంధి మల్లికార్జునరావు, ప్రీతారెడ్డి, హరిమోహన్ బంగూర్, సతీష్‌రెడ్డి
తదితర పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. తొలిరోజు సదస్సు ప్రారంభోత్సవానికి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. రెండోరోజు ముగింపోత్సవంలో
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, శర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. రెండోరోజు
మధ్యాహ్నం 2 గంటలకే సదస్సు ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి
ప్రభుత్వం ఎంపికచేసిన 14 ప్రాధాన్య రంగాలపై ఈ రెండురోజుల్లో చర్చాగోష్ఠులు
జరిగాయి.
రెండో రోజు పెట్టుబడుల సదస్సులో రిలయన్స్ సంస్థ రూ.50వేల కోట్ల పెట్టుబడులకు
ఒప్పందం చేసుకున్నట్టు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. 10వేల మందికి ఉపాధి
లభిస్తుందని వెల్లడించింది. హెచ్‌పీసీఎల్ ఎనర్జీ రూ.14.3 కోట్లతో ఒక ఒప్పందం,
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.22 కోట్లతో రెండు ఒప్పందాలు, ఫ్లిప్‌కార్ట్
సంస్థ రూ.20 కోట్లతో రెండు ఒప్పందాలు చేసుకున్నట్టు వెల్లడించింది.
రూ.3,841 కోట్ల విలువైన 14 యూనిట్ల ప్రారంభం : సదస్సు వేదికగా రూ.3,841 కోట్ల
విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా
ప్రారంభించారు. వీటివల్ల 9,108 మందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. విశాఖ
సెజ్, శ్రీసిటీ ప్రాంతాల్లో ఉన్న కింబర్లే క్లార్క్, బ్లూస్టార్,
క్లైమాటిక్, లారస్ ల్యాబ్స్, హేవెల్స్ ఇండియా, శారదా మెటల్స్, అల్లాయిస్
తదితర కంపెనీలు ప్రారంభించినవాటిలో ఉన్నాయి.