నాందేడ్ : మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. త్వరలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. తాను ఎవరికీ వ్యతిరేకిని కాదని, రైతు పక్షపాతినని కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోనూ తెలంగాణ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ ను ఆదరించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని చెప్పారు. ఎలాంటి వనరులు లేని సింగపూర్, మలేసియా వంటి దేశాలు అద్భుతాలు చేస్తుంటే, భారత్ మాత్రం ఎక్కడిదక్కడే ఉందని అన్నారు. దేశంలో అపార సహజ సంపద ఉన్నా అది జనానికి చేరువ కావడంలేదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలు దాటినా ట్రైబ్యునళ్లు దేశంలోని జలవివాదాలను ఎందుకు పరిష్కరించడంలేదు? దేశంలో ఎందుకు జల యుద్ధాలు జరుగుతున్నాయి? మహానది, గోదావరి, కావేరి నీళ్ల కోసం పంచాయితీలు ఎందుకు? రాష్ట్రాల మధ్య ఎందుకు నీటి చిచ్చు పెడుతున్నారు? అని ప్రశ్నించారు. భారత్ విశాలమైన దేశం అని, జల వనరుల విషయంలో బీఆర్ఎస్ కు స్పష్టమైన ప్రణాళిక ఉందని వివరించారు. దేశంలో జల విధానం సమూలంగా మార్చాల్సి ఉందని అన్నారు. 75 వసంతాల స్వతంత్ర భారతావనిలో దేశ రాజధాని ఢిల్లీలో నీటి లభ్యత సరిగా లేకపోవడంపై ఏమనాలి? అని వ్యాఖ్యానించారు. దేశంలో అంత గొప్ప విధానాలు ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. యువత, మేధావులు, ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.