ఐఏబీ సమావేశంలో ఆమోద ముద్ర
నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సాగునీటి సలహా మండలి
సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు : మంత్రి కాకాణి మాట్లాడుతూ జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి
సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు 46 టీఎంసీల
నీటిని విడుదల చేసేందుకు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో
తీర్మానించినట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. సాగునీరు, వ్యవసాయ సలహా మండలి
సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు, రైతులు సూచించిన అన్ని సమస్యల పరిష్కారానికి
చర్యలు చేపడుతున్నామని మంత్రి కాకాణి వెల్లడించారు. సచివాలయ స్థాయి, మండల,
జిల్లా, రాష్ట్రస్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేసి, రైతుల సమస్యలపై
దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది
మంచి గిట్టుబాటు ధర మార్కెట్లో లభిస్తుందని, ఎవరి దగ్గరికి వెళ్లకుండా
కల్లాల్లోనే ధాన్యం మంచిధరకు అమ్ముడుపోవడంతో రైతులు చాలా సంతోషంగా
ఉన్నారన్నారని, ఇది చాలా శుభపరిణామన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో
నష్టపోయిన రైతాంగాన్ని ఉదారంగా ఆదుకునేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని,
పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి
నివేదిక పంపించామన్నారు. ఏ సీజన్లో నష్టపోయిన పంటకు నష్టపరిహారాన్ని అదే
సీజన్లో జమ చేస్తున్నామని, త్వరలోనే పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో నగదు జమ
చేస్తామని, వైయస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా కూడా రైతులను ఆదుకుంటామన్నారు.
యంత్ర పరికరాలు, స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టలను సబ్సిడీపై అందించేందుకు
చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో నూరు శాతం ఈ క్రాప్ పూర్తి చేయాలనే లక్ష్యంతో
అన్ని చర్యలు చేపట్టామని, జిల్లాలో అన్ని కియోస్కోలు పూర్తిస్థాయిలో
వినియోగంలో ఉన్నాయని, వ్యవసాయ శాఖ సిబ్బంది 100 శాతం ఈ క్రాప్ పూర్తిచేయాలని
సూచించారు.
జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన వాకాటి నారాయణరెడ్డి పదవీ
కాలం ముగియడంతో ఆయనను మంత్రి, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు ఘనంగా
సత్కరించారు. సమావేశానికి హాజరైన జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఎంపీ ఆదాల
ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, వాకాటి నారాయణరెడ్డి,
కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్
కూర్మనాథ్,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు
రెడ్డి, డీసీఎంఎస్, విజయ డెయిరీ చైర్మన్లు వీరి చలపతి, కొండ్రెడ్డి
రంగారెడ్డి, జిల్లా అధికారులు,సాగునీటి, వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు, రైతు
సంఘాల నాయకులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.