గాయంతో బాధపడుతున్నరోహిత్ శర్మ (28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51
నాటౌట్) చివర్లో ధనాధన్ అర్ధ శతకంతో పోరాడినా టీమిండియాకు పరాజయం తప్పలేదు.
బంగ్లాదేశ్ తో బుధవారం ఉత్కంఠగా జరిగిన రెండో వన్డేలో భారత్ 5 పరుగుల తేడాతో
ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లా మరో మ్యాచ్ మిగిలుండగానే
2-0తో సొంతం చేసుకొంది. 2015 తర్వాత టీమిండియాపై సిరీస్ నెగ్గడం ఇదే
తొలిసారి. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ మెహ్దీ హసన్ మిరాజ్ (83 బంతుల్లో 8
ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) సెంచరీతో.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా
నిర్ణీత ఓవర్లలో 271/7 స్కోరు చేసింది. మహ్మదుల్లా (77) రాణించాడు. వాషింగ్టన్
సుందర్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఉమ్రా న్, సిరాజ్ చెరో రెండు వికెట్లు
దక్కించుకున్నారు. లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్.. ఓవర్లన్నీ ఆడి 9
వికెట్లకు 266 పరుగులు చేయగలిగింది. శ్రేయాస్ అయ్యర్ (82), అక్షర్ పటేల్
(56) ఆదుకొనే ప్రయత్నం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తొమ్మిదో నెంబర్లో
బ్యాటింగ్‌కు దిగిన రోహిత్.. ఎడాపెడా షాట్లతో గెలుపుపై ఆశలు రేపినా.. అతడికి
తగిన సహకారం లభించలేదు. 48వ ఓవర్లో సిరాజ్ (2) ఒక్క పరుగైనా చేయక పోవడం
ఒకరకంగా గెలుపుపై ప్రభావం చూపింది. ఆఖరి ఓవర్లో 20 పరుగులు కావాల్సి ఉండగా..
తొలి 5 బంతుల్లో రోహిత్ 14 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి సిక్స్ కొడితే
భారతదే విజయం. కానీ, ముస్తాఫిజుర్ యార్కర్ వేయగా.. రోహిత్ ఆడలేకపోయాడు.