కాకినాడ : సేవా కార్యక్రమాల నిర్వహణలో ఇప్పటికే వివిధ పురస్కారాలు
సొంతం చేసుకున్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ మరో
అవార్డును సాధించింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 20వ తేదీ వరకు రెడ్‌క్రాస్
సొసైటీలో సభ్యత్వ నమోదుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ జరిగింది. ఈ
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కాకినాడ జిల్లా అత్యుత్తమ ప్రతిభ
కనబరచినందుకు సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఇండియన్
రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ డా.
కృతికా శుక్లా.. రాష్ట్ర గవర్నర్, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షులు
బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. వివిధ సేవా
కార్యక్రమాలు చేపడుతూ సామాజిక సేవలో విశిష్టతను, తనదైన గుర్తింపును
పొందిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ ఇటీవల రాష్ట్రంలోనే
అత్యుత్తమ జిల్లా శాఖగా పురస్కారం సాధించింది. ఇప్పుడు సభ్యత్వ
నమోదులోనూ ముందు వరుసలో నిలిచి రాష్ట్రస్థాయి అవార్డును సొంతం
చేసుకున్నందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కలెక్టర్, జిల్లా శాఖకు
అభినందనలు తెలియజేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ వాత్సల్య
వృద్ధాశ్రమం, యోగా కేంద్రం, విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలు, తలసేమియా
కేంద్రం, బ్లడ్ బ్యాంకు వంటి వాటితో నిబద్ధత, అంకితభావంతో సమాజానికి విశేషమైన
సేవలు అందిస్తోందని.. ఇప్పటికే వివిధ అవార్డులు సొంతమయ్యాయని కలెక్టర్
డా. కృతికా శుక్లా తెలిపారు. ఇప్పుడు సభ్యత్వ నమోదులోనూ గవర్నర్ చేతుల
మీదుగా బంగారు పతకం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో
భవిష్యత్తుల్లోనూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా శాఖకు మంచి
గుర్తింపు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డా. కృతికా
శుక్లా గవర్నర్ నుంచి అవార్డు అందుకోవడంపై రెడ్‌క్రాస్ జిల్లా శాఖ
ఛైర్మన్ వైడీ రామారావు శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ డా. కృతికా
శుక్లా నేతృత్వంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు
తెలిపారు.