రెడ్‌క్రాస్ సేవలకు సహకరించిన వారికి అవార్డుల ప్రదానం
రూ.45లక్షలతో వాహనాలు సమకూర్చిన నేషనల్ ఇన్సూరెన్స్
విజయవాడ : రెడ్‌క్రాస్ ఉద్యమంలో జిల్లా స్ధాయిలో కలెక్టర్లదే కీలక భూమిక అని,
స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయం తీసుకువచ్చి పేదలకు సేవలు అందేలా చూడాలని
ఆంద్రధప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అవసరమైన వనరులను
సమకూర్చి రెడ్‌క్రాస్ ఉద్యమం పెద్ద ఎత్తున సాగేలా సహకరించాలన్నారు. సోమవారం
రాజ్‌భవన్ దర్బార్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రెడ్ క్రాస్ సేవలకు
విభిన్న రూపాలలో తోడ్పాటు అందించిన సీనియర్ ఐఎఎస్ అధికారులు, జిల్లా
కలెక్టర్లు, వ్యధాన్యులకు గవర్నర్ రెడ్‌క్రాస్ అవార్డులను అందజేశారు.
రెడ్‌క్రాస్ నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాన్ని తొలుత
హరిచందన్ ప్రారంభించారు. ఇందుకోసం నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.45 లక్షలు
సమకూర్చగా, తద్వారా కొనుగోలు చేసిన రెండు వాహనాలకు గవర్నర్ జెండా ఊపారు.
ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల
సమయంలో ప్రజల ఇబ్బందులను తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషికి
అనుబంధంగా రెడ్ క్రాస్ మానవతా సేవలను అందించడంలో వంద సంవత్సరాలు
పూర్తిచేసుకుందన్నారు. రాష్ట్ర శాఖ గత మూడేళ్లలో పెద్దఎత్తున చెట్ల పెంపకం
ప్రచారం, రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాలు నిర్వహించటం ముదావహమన్నారు.
రెడ్‌క్రాస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్వచ్ఛంద సేవ పట్ల విద్యార్థులు,
యువతలో అవగాహన కల్పించేలా సైకిల్ ర్యాలీ నిర్వహించటం మంచి కార్యక్రమమన్నారు.
కరోనా ఇబ్బందుల వేళ రాష్ట్ర శాఖ అందించిన సేవలను వివరిస్తూ గిరిజన
ప్రాంతాల్లో ప్రత్యేక బహుళ ప్రయోజన ఆరోగ్య శిబిరాలను నిర్వహించామని రెడ్
క్రాస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
గత మూడు సంవత్సరాలలో జిల్లా కలెక్టర్లుగా అత్యధిక సభ్యత్వాలు, విరాళాలను
సమీకరించి ఇతోధిక సేవ చేసి సీనియర్ ఐఎఎస్ అధికారులు డి.మురళీధర్ రెడ్డి, జె.
నివాస్లతో పాటు, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కాకినాడ
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నెల్లూరు కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,
పాడేరు ఐటిడిఎ పిఓ గోపాలకృష్ణ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఛీప్ రీజనల్ మేనేజర్
రాజు స్టీవెన్ సన్ లకు గవర్నర్ మెడల్స్ అందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్
సొసైటీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి
సిసోడియా, రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి ఎ.కె.పరిదా తదితరులు పాల్గొన్నారు.