ముఖ్య అతిధిగా రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, గౌరవ అతిధిగా సి.ఎస్. హాజరు
ఎన్నికల జాబితా నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన ముగ్గురు జిల్లా కలెక్టర్లకు పురస్కారాలు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
అమరావతి : 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా, ప్రభుత్వప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి గౌరవ అతిధిగా ఈ వేడులకు హాజరవుతున్నారన్నారు. ఉదయం 11.32 గంటలకు జాతీయ గీతాలాపన తదుపరి ముఖ్య అతిథి జ్యోతి ప్రజ్వలన చేయడంతో ఈ వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. స్వాగతోపన్యాసం తదుపరి గౌరవ అతిధి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్ జవహర్ రెడ్డి ప్రసంగిస్తారన్నారు. అనంతరం గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా నూతనంగా ఓటర్లుగా నమోదైన యువతకు ఎపిక్ కార్డులు అందజేయడంతో పాటు ఎన్నికల జాబితా నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ముగ్గురు జిల్లాల కలెక్టర్లు సుమిత్ కుమార్ (అల్లూరి సీతారామరాజు జిల్లా), నాగలక్షీ (విజయనగరం జిల్లా) మరియు ఎస్.డిల్లీ రావు (ఎన్.టి.ఆర్. జిల్లా) కు పురస్కారాలను అందజేస్తారన్నారు. అదే విధంగా ముగ్గురు ఇ.ఆర్.ఓ.లు నెల్లూరు మున్సిఫల్ కమిషనర్ వికాస్ మర్మత్, సింహాచలం దేవస్థానం ఎస్.డి.సి. కె.వి.రామలక్ష్మీ, భీమునిపట్నం ఆర్.డి.ఓ. ఎస్.భాస్కర్ రెడ్డి, ముగ్గురు ఏ.ఇ.ఆర్.ఓ.లు కోడుమూరు మండలం తాసీల్దారు బి.జయన్న, మైదుకూరు తాసీల్దారు బి.అనురాధ, గిద్దలూరు తాసీల్దారు డి.సీతారామయ్య మరో 23 మంది బి.ఎల్.ఓ.లకు మరియు తమ కార్యాలయానికి చెందిన ఎస్.ఓ. జి.శ్రీనివాసరావు, ఏ.ఎస్.ఓ. బి.సుధాకర్ తో పాటు మరో ఐదుగురు సిబ్బందికి ఈ అవార్డులను ప్రధానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం వేడుకలకు హాజరైన వారందరితో జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞను చేయించడం జరుగుతుందని, ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 12.13 గంటలకు ముఖ్యఅతిథి ప్రసంగం ఉంటుందని, అనంతరం జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగుస్తుందని ఆయన తెలిపారు. విజయవాడ నగర ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.