రైతులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి జగన్ ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకు
వచ్చారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ
కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
చంద్రబాబు హయంలో కంటే జగన్ హయాంలో అధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఆయన
పేర్కొన్నారు. మూడున్నరేళ్లలో 2 కోట్ల 88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని
కొనుగోలు చేసినట్లు తెలిపారు. అదే చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో కేవలం 2 కోట్ల 25
లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని..
తేడాను గమనించాలని సూచించారు.
అదేవిధంగా మంత్రి మాట్లాడుతూ.. “రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా నేరుగా
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోంది. దళారి వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాం.
ధాన్యం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశాం. టీడీపీ రైతుల్ని
రెచ్చగొట్టినా వారు మా నిర్ణయానికే మద్దతు తెలిపారు. ప్రతి రైతుకు ఎకరాకు
అదనంగా రూ.8 వేలు లబ్ది కలిగింది. ప్రతి పక్షాలకు చెందిన రైతులు కూడా
ప్రస్తుతం సీఎం జగన్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కొందరు మిల్లర్లు తోక
జాడిస్తే వారిపై చర్యలు తీసుకున్నాం. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం
ఆదేశించారు.” అని నాగేశ్వర రావు వెల్లడించారు.
“రైతులను మిల్లర్లు ఎవరైనా ఇబ్బంది పెడితే ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్
ఏర్పాటు చేశాం. కొద్ది మంది మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వారిపై
చరయలు తప్పవు. 21 రోజులు కాకుండానే రైతులకు డబ్బులు జమ చేస్తున్నాం. ఇదంతా
చూసిన పచ్చ పత్రికలకు కళ్లు మండుతున్నాయి. చంద్రబాబు రైతుకు గిట్టుబాటు ధర
కల్పించనప్పుడు ఆ పత్రికలు ఏం చేశాయి,” అని మంత్రి మండి పడ్డారు.