అమరావతి : అవినీతికి ఎటు వంటి ఆస్కారం
లేకుండా, ఎంతో పారదర్శకంగా రైతుల శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా పశు సంవర్థక,
మత్స్య, పాడి అభివృద్ది శాఖలు పనిచేస్తున్నాయని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య,
పాడి అభివృద్ది శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. శుక్రవారం అమరావతి
సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
గత మూడేళ్లలో పశు సంవర్థక, పాడి అభివృద్ది శాఖల ద్వారా సాధించిన ప్రగతిని
వివరించారు. పశు సంవర్థక శాఖ సాధించిన ప్రగతిని మంత్రి వివరిస్తూ మన
రాష్ట్రంలో 42 లక్షల కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు.
ప్రభుత్వ పరంగా వీరందరికీ అన్ని విధాలుగా లబ్దిచేకూర్చి తద్వారా వీరి జీవన
ప్రమాణాలను పెద్ద ఎత్తున మెరుగు పర్చాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా
పలు వినూత్న పథకాలను రాష్ట్రంలో అమలు పర్చడం జరుగుచున్నదన్నారు. ఫలితంగా గత
ఆర్థిక సంవత్సరంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని, 154.03
లక్షల మెట్రిక్ టన్నులు పాలు, 10.26 లక్షల మెట్రిక్ టన్నులు మాంసం మరియు
2,645.03 కోట్ల గుడ్ల దిగుబడి అయి వ్యవసాయ రంగంలో మూడో వంతు ఆదాయం పశు సంవర్థక
శాఖ ద్వారా సమకూరిందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సంతో గత ఏడాది దిగుబడులను
పోల్చుకుంటే పాల ఉత్పత్తిలో 108.14 శాతం, మాంసం ఉత్పత్తిలో 131.24 శాతం, గుడ్ల
ఉత్పత్తిలో 133.89 శాతం పురోగతిని సాధించడమే కాకుండా రాష్ట్ర స్థూల జాతీయ
ఉత్పత్తి ప్రస్తుత ధరల మేరకు 140.62 శాతం, స్థిర ధరల మేరకు 117.56 శాతం
పురోగతిని సాధించడం జరిగిందని మంత్రి తెలిపారు.
దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో 10,606 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి
ఆయా కేంద్రాల ద్వారా రైతుల ముంగిళ్లలోనే పలు రకాల సేవలను రాష్ట్ర ప్రభుత్వం
అందజేయడం జరుగుచున్నదన్నారు. నాణ్యమైన ఇన్పుట్స్ ను పలు రాయితీలపై ఈ కేంద్రాల
ద్వారా సరఫరా చేయడమే కాకుండా ఆయా కేంద్రాల్లో నియమించబడిన పశుసంవర్థక శాఖ
సహాయకులు గ్రామాల్లో పెద్ద ఎత్తున పశు ఆరోగ్య సంరక్షణ సేవలను అందజేయడం
జరుగుచున్నదన్నారు. వైఎస్సార్ చేయూత-జగనన్న పాలవెల్లువ మరియు జగనన్న
జీవక్రాంతి పధకాల క్రింద లక్ష్యాలను అధిగమిస్తూ పెద్ద ఎత్తున
పశువులను/యూనిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ
వై.ఎస్.జగన్మొహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పథకాల క్రింద వచ్చే ఆర్థిక సంవత్సరం
నుండి ఏడాదికి లక్ష పశువులు / యూనిట్లను అందజేయడం జరుగుతుందని మంత్రి
తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యత నిస్తున్నదో అదే
తరహాలో పశు ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత నిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పశు వ్యాధి నిర్థారణ కేంద్రాలను వికేంద్రీకరిస్తూ రైతుభరోసా కేంద్రాల్లో 154
డా.వై.ఎస్.ఆర్. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ను, జిల్లా స్థాయిలో 10 పశు వ్యాధి
నిర్థారణ ప్రయోగశాలలను, ప్రాంతీయ స్థాయిలో 4 పశు వ్యాధి నిర్థారణ ప్రయోగ
శాలలను మరియు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరుగుచున్నదని
మంత్రి తెలిపారు. ఇప్పటికే 60 డా.వై.ఎస్.ఆర్. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ను
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగిందని, మరో 52 ప్రారంభానికి సిద్దంగా
ఉన్నాయని, మిగిలిన 42 వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని ఆయన తెలిపారు.
డా.వై.ఎస్.ఆర్. సంచార పశు ఆరోగ్య సేవలను కూడా తమ ప్రభుత్వం అమల్లోకి
తీసుకువచ్చిందని, మొదటి విడతలో 175 నియోజక వర్గాల పరిధిలో రూ.133.58 కోట్ల
వ్యయంతో 175 వాహనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని, రెండో విడతలో
రూ.119.33 కోట్ల అంచనా వ్యయంతో మరో 165 వాహనాలను వచ్చే ఏడాది జనవరి
నెలాఖరులోపు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని
మంత్రి తెలిపారు. పశువులను నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు డా.వై.ఎస్.ఆర్.
పశు భీమా పథకాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేయడం జరుగుచున్నదన్నారు. ఈ
పథకం క్రింద రూ.386 కోట్ల మేర భీమా సొమ్ము చెల్లించాల్సి ఉందని అంచనావేయడం
జరిగిందని, ఇందులో ఇప్పటి వరకూ రూ.78 కోట్ల మేర భీమా సొమ్మును రైతుల
ఖాతాల్లోకి జమచేయడం జరిగిందని, మరో రూ.78 కోట్ల మేర భీమా సొమ్మును రైతులకు
చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, మిగిలిన సొమ్ముకు సంబంధించిన
క్లైమ్స్ థర్డు పార్టీ వెరిఫికేషన్ లో ఉన్నాయని, వచ్చే ఏడాది జనవరిలో ఆ
సొమ్మును కూడా చెల్లించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
రూ.17.40 కోట్ల అంచనా వ్యయంతో 58 డా.వై.ఎస్.ఆర్.దేశీయ గోజాతుల పెంపక
కేంద్రాలను రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందని, మరో 25 కేంద్రాలను రూ.7.50
కోట్లతో ఏర్పాటు చేసేందుకు చర్యలను చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు.
జగనన్న పాలవెల్లువ పధకం-రాష్ట్రంలో రోజుకు 4కోట్ల లీటర్ల పాలఉత్పత్తి…..
రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి
వివరిస్తూ రాష్ట్రంలో ప్రపంచంలోనే ప్రముఖ జాతులకు చెందిన పశువులతో జగనన్న
పాలవెల్లువ పధకాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందని, ప్రస్తుతం రోజుకు
4కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతోందని మంత్రి సీదిరి అప్పల రాజు తెలిపారు.
కాగా ఉత్పత్తి అవుతున్న పాలలో 2కోట్ల లీటర్ల పాలను డొమెస్టిక్ గా
వినియోగిస్తున్నారని మరో 60 లక్షల లీటర్లు ప్రైవేట్ డైరీల ద్వారా ఉత్పత్తి
అవుతుండగా మిగతా కోటి 40లక్షల లీటర్ల పాలు అసంఘటిత రంగం నుండి పాల ఉత్పత్తి
జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో మహిళా డైరీ సహకార
సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పారు.ఇప్పటికే 17 జిల్లాల్లోని 3వేల
108 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 1727 సంఘాలను ఇప్పటికే ఏర్పాటు చేయడం
జరిగిందని మంత్రి సీదిరి అప్పల రాజు మీడియాకు వివరించారు.అంతేగాక చిన్న
గ్రామాల్లో ఆటోమేటెడ్ మిల్క్ కలక్షన్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయడం
జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో 3 వేల కోట్ల రూ.ల వ్యయంతో మహిళా డైరీ సహకార
సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని అనగా 1300 కోట్ల రూ.లతో బల్క్ మిల్క్ కూలింగ్
యూనిట్లు (BMCU), 1800 కోట్ల రూ.లతో ఆటోమేటెడ్ మిల్క్ కలక్షన్
కేంద్రాలు(ఎఎంసి)మంత్రి అప్పల రాజు వెల్లడించారు. ఇప్పటికే గుజరాత్ కోఆపరేటివ్
మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(అముల్)తో ప్రభుత్వం 2020 జూలైలో అవగాహనా
ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందన్నారు. అముల్ రాకతో పాల ఉత్పత్తికి
సంబంధించి మంచి పోటీ ఏర్పడిందని అముల్ పాలు సరఫరా చేసే సంఘాలకు లీటరుకు ఒక
రూపాయి వంతున హేండ్లింగ్ చార్జీల కింద అందివ్వడం తోపాటు ఆరు మాసాలకు ఒక సారి
డివిడెండ్ ను కూడా ఇస్తోందని అన్నారు.
పశువైద్య సేవలకై 1962 కాల్ సెంటర్ కు ఫోన్ చేసిన మంత్రి సీదిరి అప్పల రాజు
రాష్ట్రంలో డా.వైయస్సార్ పశు ఆరోగ్య సేవా పధకం కింద 175 అసెంబ్లీ నియోజకవర్గాల
పరిధిలో 175 మొబైల్ ఆంబులేటరీ వెటర్నరీ క్లినిక్స్ ను ఏర్పాటు చేయగా అవి
విజయవంతంగా పనిచేస్తున్నట్టు మంత్రి సీదిరి అప్పల రాజు వెల్లడించారు.ఇందుకు
సంబంధించి వాటి పర్యవేక్షణకై 1962 టోల్ ఫ్రీ నంబరుతో ఏర్పాటు చేసిన కాల్
సెంటర్ ఏవిధంగా పనిచేస్తుందో మీడియాకు వివరించేందుకు మంత్రి పత్రికా విలేఖరుల
సమావేశం నుండే స్వయంగా కాల్ సెంటరుకు ఫోన్ చేసి తాను శ్రీకాకుళం జిల్లా వజ్రపు
కొత్తూరు నుండి మాట్లాడుతున్నానని తన ఆవుకు అనారోగ్యం చేసి నోటి నుండి సొంగ
కారుతోందని నడవలేక పోతోందని చెప్పారు. ఆకాల్ స్వీకరించిన కాల్ సెంటర్ సిబ్బంది
డాక్టర్ చూస్తారని సాయంత్రం 5గం.లలోగా మీకు మరలా పోన్ చేస్తారని
చెప్పారు.మంత్రివర్యుల మొబైల్ కు ఫోన్ రాగా తాను రాష్ట్ర పశుసంవర్ధక మరియు
పాడిపరిశ్రమ మంత్రి సీదిరి అప్పల రాజునని కాల్ సెంటర్ ఏవిధంగా పనిచేస్తుందోని
మీడియాకు తెలిపేందుకు టెస్ట్ కాల్ చేశాని చెప్పడంతో కాల్ సెంటర్ సిబ్బంది
ఆశ్చర్యాన్నికి గురయ్యారు. ఈకాల్ సెంటర్ కు గత నెల 30నాటికి మొత్తం 2లక్షల
45వేల 417 కాల్స్ రాగా 99వేల 580 ట్రిప్పులు ఈ మొబైల్ ఆంబులేటరీ వెటర్నరీ
క్లినిక్స్ వెళ్ళి లక్షా 16వేల 774 పుశువులకు వైద్య సేవలు అందించాయని మంత్రి
అప్పలరాజు మీడియాకు వివరించారు. దానివల్ల లక్షా 3వేల 929 మంది రైతులు లబ్ది
పొందారని వివరించారు. ఈమీడియా సమావేశంలో రాష్ట్ర మత్స్యశాఖ కమీషనర్
కె.కన్నబాబు,రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్ పాల్గొన్నారు.