న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రరాష్ట్రానికి ఇస్తామని ప్రకటించిన
హామీలను నెరవేర్చాలని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో గట్టిగా ప్రశ్నిస్తామని
ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. రైల్వే పరంగా బడ్జెట్లో రాష్ట్రానికి ఈ
సారి రూ. 8500 కోట్లు కేటాయించామని గణాంకాల్లో చెబుతున్నా, వాటిని ఏ విధంగా
ఖర్చు చేయబోతోందీ రైల్వే శాఖ సవివరంగా చెప్పాలని కోరుతున్నామని తెలిపారు.
రాష్ట్రం వైపు నుంచి భూసేకరణకు మేము డబ్బులివ్వడం లేదని రైల్వే సాకులు
చెబుతోందన్నారు. అయితే ఇవన్నీ 2014 కుముందు మంజూరయిన వాటి గురించి కేంద్రం
చెబుతోంది తప్ప రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన మార్పులు, రాష్ట్ర ఆర్థిక
స్థితిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడడం లేదన్నారు. తిరిగి చర్చలు జరిపి,
రాష్ట్ర వాటా విషయంలో మార్పులు చేయాలని తమ విజ్ఞప్తిగా పేర్కొన్నారు. రానున్న
రెండు మూడు రోజుల్లో దీనిపై పార్లమెంటులో గట్టిగానే ప్రశ్నిస్తామన్నారు. జాతీయ
రహదారుల విషయంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జాతీయ రహదారిపైకి అరగంటలో
చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారని,
దీనికనుగుణంగానే ఎక్కువ జాతీయ రహదారులను మంజూరు చేయించుకోగలిగామని, జగన్
ఆశయసాధన కోసం త్వరితంగా ఈ పనులు పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర వాటా తగ్గించాలి
నడికుడి–శ్రీకాళహస్తి ప్రాధాన్యమైన రైల్వే లైను. కేంద్ర రాష్ట్రాల మధ్య 2014కు
మందు కుదిరిన ఒప్పందాన్నే ఇప్పుడూ కొనసాగించాలనడం సరికాదని ఒక ప్రశ్నకు
సమాధానంగా చెప్పారు. అప్పటి ఆర్థిక స్థితి వేరు. విభజన తర్వాత రాష్ట్ర
పరిస్థితి వేరుగా ఉంది. బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోనే ఇలాంటి
ఒప్పందాలను మార్చుకున్న ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. మన రాష్ట్ర వాటా విషయంలో
తగ్గించాలన్నది మా విన్నపం. దీనిపై పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా
పట్టుబడతామని వివరించారు.
తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి మాట్లాడుతూ మోడల్ బస్టాండుగా తిరుపతిని
తీర్చి దిద్దుతున్నట్లు చెప్పారు. తిరుపతి తీర్థయాత్రా నగరం కనుక, ఇక్కడి
బస్టాండును సమున్నతంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ
విజయవాడ వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి జగన్ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
దీనికనుగుణంగా రూ. 500 కోట్లతో మోడల్ బస్టాండుకు వచ్చే ప్రతిపాదనలు సిద్ధం
చేస్తున్నాం. అలానే తిరుపతిలో రోప్‌వే కు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి
ప్రతిపాదించాం. శ్రీకాళహస్తిలోనూ రోప్వేకు ప్రతిపాదనలు తయారు చేశాం. విద్యా
పరంగా అభివృద్ధి కోసం నైలెట్ సంస్థ ను తిరుపతిలో ఏర్పాటు చేయడానికి
నిర్ణయించామని, దీనికి సంబంధించి ఒక బృందం కూడా వచ్చి సర్వే చేసింది. అవసరమైన
భవనాలనూ గుర్తించి, కేంద్రానికి ప్రతిపాదనలు చేశామని, దీనికి త్వరలో అనుమతులు
రానున్నాయని పేర్కొన్నారు.
తిరుపతిలో కేంద్ర ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం
ఢిల్లీ వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను
కలిసి తిరుపతిలో కేంద్ర ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని
కోరారు. ఆ ఫైలు మహిళా భద్రతా విభాగం డైరెక్టరేట్ వద్ద ఉందని, అదీ సాకారమయ్యే
అవకాశముందని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో సైదాపురం
మండలంలో రెండు కేంద్రీయ విద్యాలయ భవనాలు శిథిల స్థితిలో ఉన్నాయని , ఇవి
నిర్మించి 50 ఏళ్లయిందని చెప్పారు. ఈ పాఠశాలల భవనాల నిర్మాణానికి కేంద్ర
మంత్రి భూపేంద్రయాదవ్ స్పష్టమైన హామీ ఇచ్చి, ప్రతిపాదనలు పంపాలని కోరారని
చెప్పారు. స్టాప్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలూ చేపడతామని
కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తెలిపారు.
జాతీయ ఉత్సవ పోర్టల్‌లో తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం బ్రహ్మోత్సవాలు:
తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల కేలండర్‌ను జాతీయ ఉత్సవ పోర్టల్‌లో
కాని, జాతీయ పర్యాటక కేలండర్లో కాని చూపడం లేదన్నారు. తమ విజ్ఞప్తి మేరకు
మొన్ననే ఉత్సవ పోర్టల్‌లో చేర్చారని ఎంపీ గురుమూర్తి చెప్పారు. శ్రీకాళహస్తి,
కాణిపాకం బ్రహ్మోత్సవాల వివరాలనూ ఉత్సవ పోర్టల్‌లో చూపాలని కోరామని, వాటినీ ఆ
పోర్టల్‌లో చూపుతారని ఆశిస్తున్నామన్నారు. తిరుపతిలో ప్లానిటోరియం ఏర్పాటుకు
కేంద్రాన్ని కోరామని, రూ. 13 కోట్లతో ప్లానిటోరియం ఏర్పాటు చేస్తామని కేంద్ర
ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిందని చెప్పారు. దీనికీ బదులిస్తున్నామన్నారు.
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో ఆహార ప్రయోగశాల ఏర్పాటుకు రూ. 10 కోట్లు
మంజూరయిందని ఎంపీ గురుమూర్తి చెప్పారు. మహిళా విశ్వవిద్యాలయంలో మరో ప్రాజెక్టు
కోసం రూ.2 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. తిరుపతి స్విమ్స్‌లో కేన్సర్
పరికరాల కొనుగోలు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సామాజిక బాధ్యత పథకం
(సీఎస్ఆర్) కింద అవసరమైన పరికరాల కోసం రూ. 22 కోట్లు కేటాయించిందని, ఒప్పందం
కూడా కుదుర్చుకున్నామని చెప్పారు. రహదారుల పరంగా చూస్తే రూ. 7వేల కోట్లతో
జాతీయ రహదారి పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. రూ.560 కోట్లతో
క్రిబ్కో యూనిట్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు.
శ్రీకాళహస్తి–నడికుడికి మరిన్ని కేటాయింపులపై అడుగుతాం
శ్రీ కాళహస్తి– నడికుడి రైల్వే పనులకు రూ. 220 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్న
అసంతృప్తి ఉందని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని, ఎక్కువ నిధుల మంజూరు కోసం
ఒత్తిడి చేస్తామని తెలిపారు. కృష్ణపట్నం ప్రాంతంలో కార్గో టెర్మినల్ అనుమతులు తుది దశలో ఉన్నాయని, దీనికీ
త్వరగా అనుమతులు ఇస్తే అక్కడ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని
ఆశిస్తున్నామని చెప్పారు. ఈ పనులన్నింటి విషయంలో సీఎం జగన్ తమను పరుగులు
పెట్టిస్తూ, అభివృద్ధి సాధనకు తమను ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు
కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని తెలిపారు.