తిరుపతి : తిరుపతి పార్లమెంట్ పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారంపై స్పందించాలని కోరుతూ సోమవారం డిల్లీలో కేంధ్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సమావేశమయ్యారు. తిరుపతి, రేణిగుంట జంక్షన్ల మధ్య తిరుచానూరు రైల్వేస్టేషన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలన్నారు. అలాగే రేణిగుంట రైల్వే జంక్షన్ సమీపంలో రైల్వే బ్రిడ్జి నంబర్ 171 నుంచి 175 వరకు 1200 మీటర్ల పొడవునా తగినంత నీటి పారుదల సౌకర్యం లేదని, ట్రాక్‌ను కాపాడేందుకు స్ట్రోమ్ డ్రెయిన్ అవసరమని మంత్రికి నివేదించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిల గురించి మాట్లాడుతూ వెంకటగిరి రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి 565 పై రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరమని, ఆలాగే జాతీయ రహదారి నుండి సర్వేపల్లి మీదుగా ముత్తుకూరు వెళ్లే మార్గంలో వెంకటాచలం వద్ద ఉన్న గేటు వద్ద కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్నారు. తిరుపతి వెస్ట్ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌కు దక్షిణం వైపు ఉన్న యాక్సెస్ రోడ్డు చాలా ఇరుకుగా ఉన్న విషయాన్ని మంత్రి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. పశ్చిమ రైల్వే స్టేషన్‌కు ఉత్తరం వైపు రోడ్డు నిర్మాణం చేయాలని, దీని వల్ల ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయని వివరించారు. పశ్చిమ రైల్వే స్టేషన్, తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఎస్వీ ఆర్ట్స్ , సైన్స్ కళాశాల, వెటర్నరీ కళాశాల, పద్మావతి మహిళా కళాశాల ,పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వంటి విద్యా సంస్థలకు సమీపంలో ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఉదయం, సాయంత్రం వేళల్లో రైళ్ల నిలుపదలకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఐఆర్ సిటిసి నడుపుతున్న శ్రీ రామాయణ యాత్ర 17, 18 రోజుల పర్యటన కోసం నడుపుతున్న రైలు రేణిగుంట రైల్వే స్టేషన్ మీదుగా వెళుతోందని, తిరుపతికి రైలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పీఎం గతిశక్తి కార్యక్రమం ద్వారా తిరుపతి నియోజకవర్గంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయనని కోరడం జరిగిందని తన విజ్ఞాపనలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎంపీ గురుమూర్తి తెలిపారు.