మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు, డాక్టర్లు తీరుపై ఆగ్రహం వ్యక్తం
మచిలీపట్నం : వైద్య వృత్తిలో సీనియార్టీ పెరగడం ఘనత ఏమి కాదని, ఆరోగ్యం బాగు
చేసుకునేందుకు వచ్చిన పేద మధ్యతరగతి రోగుల పట్ల శ్రద్ధ కనబరిచినప్పుడే
వృత్తిలో ఎనలేని సంతృప్తి ఉంటుందని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి
ఎం. టి. కృష్ణబాబు నిర్వచించారు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి పనితీరుపై వైద్య
ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు సమీక్ష జరిపారు.
ఆసుపత్రిలో సిటీ స్కాన్, డార్క్ రూమ్, కౌన్సిల్ రూమ్, గైనకాలజీ విభాగం,
మైక్రోబయాలజీ రూమ్ వివిధ విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసిన కృష్ణబాబు డాక్టర్ల
హాజరు, బయోమెట్రిక్ పనితీరు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, పారిశుధ్యం,
మౌలిక సదుపాయాలపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం జిజిహెచ్ లో
డాక్టర్ల హాజరు తక్కువ ఉండటం, డ్యూటీ ముగిసే సమయానికన్నా ముందే వెళ్లిపోవడం,
పారిశుద్ధ్య కార్మికుల హాజరు తక్కువ ఉండటం, హాస్పిటల్ ఏడి, ఏఓ పనితీరుపై
ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సరిగ్గా
పనిచేయని డాక్టర్లు, సిబ్బందిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆసుపత్రి
సూపరింటెండెంట్ డాక్టర్ జి.ఎస్. రమేష్ ను ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎంతమందికి
మెమోలు ఇచ్చారో చెప్పాలన్నారు. వచ్చే ఆగస్టు నెల నుంచి పనితీరు మార్చుకోకపోతే
పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు, సిబ్బందిని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలోని వైద్య సిబ్బందికి ప్రభుత్వం ఏటా 1400 కోట్లు జీతభత్యాల కోసం
ఖర్చు చేస్తున్నారన్న సంగతి ఏ ఒక్కరు మరువరాదన్నారు. ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాల్లో 63 వైద్య పరీక్షలు జరుపుతారని, జిల్లా ఆస్పత్రిలో 174 పరీక్షలు
నిర్వహిస్తారని, మచిలీపట్నం జిజిహెచ్ లో నిర్వహిస్తున్నారని కృష్ణబాబు
వైద్యుల్ని అడిగారు. హార్మోన్ పరీక్షలు థైరాయిడ్ టెస్టింగ్, గూర్చి
ప్రశ్నించారు అలాగే ఫార్మసీ యూనిట్ సర్జికల్ వార్డుకు వెళ్లి రోగులకు
అందుతున్న వైద్య సాయం గురించి ఆయన ప్రశ్నించారు. వివిధ వార్డుల్లో టాయిలెట్ల
నిర్వహణ ఏ విధంగా ఉందో ఆయన స్వయంగా పరిశీలించారు. 500 రకాల మెడిసిన్స్ లో 450
రకాలు ప్రభుత్వ ఆసుపత్రికి సరఫరా కాపాడుతున్నాయని, మందుల కొరత సాకుగా చూపి
చికిత్సలలో జాప్యం చేయరాదన్నారు. ఆసుపత్రికి ఏది అవసరమో ఇండెంట్ ఇవ్వమని తాను
ప్రతిసారి తెలియజేస్తున్న అత్యధిక శాతం మంది వైద్యులు స్పందించడం లేదన్నారు. ఈ
సమావేశంలో మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), మచిలీపట్నం
జిజిహెచ్ మెడికల్ సూపర్నెంట్ డాక్టర్ జి.ఎస్ రమేష్, డి ఎం ఈ డాక్టర్ డి ఎస్ వి
ఎల్ నరసింహరావు, మచిలీపట్నం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ విజయకుమారి తదితరులు
పాల్గొన్నారు.