గుంటూరు : ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు
అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.
తాజాగా హైదరాబాదులో మెడికో ఆత్మహ్యత ఘటన నేపథ్యంలో మంత్రి రాష్ట్రంలోని
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్ అందరితో
సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్ లో ఉన్న
వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డైరెక్టర్
ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఎఎస్, డాక్టర్ వైఎస్సార్
హెల్త్ యూనివర్సిటీ వీసీ బాబ్జి, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తదితరులు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ర్యాగింగ్ భూతం
విషయంలో అన్ని మెడికల్ కళాశాలలు కఠినంగా ఉండాలని స్పష్టంచేశారు.
మెడికోలపై ఎక్కడా, ఎలాంటి వేధింపులు ఉండటానికి వీల్లేదని చెప్పారు.
కళాశాలల్లోని యాంటీ ర్యాగింగ్ కమిటీలు పూర్తిస్థాయిలో చురుకుగా
పనిచేయాలని చెప్పారు. ర్యాగింగ్, ఇతర వేధింపులకు సంబంధించి ఆయా
కళాశాలలపై నేరుగా డీఎంఈ, హెల్త్ యూనివర్సిటీ వీసీ పర్యవేక్షణ
ఉండాలన్నారు.
పటిష్టమైన చర్యల ద్వారానే ఫలితాలు
చదువుల్లో నాణ్యతే కాదని, భద్రత కూడా ఉండాలని మంత్రి విడదల రజిని
తెలిపారు. పటిష్టమైన చర్యల ద్వారా మనం సురక్షితంగా మెడికోలను
సమాజంలోకి తీసుకురాగలమని చెప్పారు. అన్ని మెడికల్ కళాశాలల్లో
విద్యార్థులకు కౌన్సెలింగ్ సెషన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఒత్తిడి నుంచి
బయటపడేలా విద్యార్థులకు యోగా, ధ్యానం లాంటి అంశాలపై అవగాహన
పెంచాలన్నారు. కళాశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు అందుబాటులో ఉంచాలన్నారు.
ఏదైనా సమాచారాన్ని వెనువెంటనే చేరవేసేలా క్యాంపస్‌లో పలు చోట్ల మైక్‌లు
ఏర్పాటుచేసుకోవాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండేలా
చూడాలన్నారు.
డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాంతో ప్రజలకు మేలు
ఎన్ ఎం సీ నిబంధనలకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి మెడికల్
కళాశాల డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ను అమలు చేయాల్సి ఉందని మంత్రి
విడదల రజిని తెలిపారు. ఈ డీఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పీజీ
విద్యార్థి మూడు నెలల పాటు కచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో పనిచేయాల్సి ఉందని
చెప్పారు. ప్రతి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌కు వారి పరిధిలో మ్యాప్
చేసిన డీహెచ్, ఏహెచ్, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల జాబితాను ఇప్పటికే పంపామని
తెలిపారు. ఆ జాబితాలో ఉన్న ఆస్పత్రుల్లో పీజీ లు కచ్చితంగా మూడు నెలలు
పనిచేసేలా షెడ్యూల్ తయారుచేసుకుని పంపాలని పేర్కొన్నారు.