రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్
పార్వతీపురం మన్యం జిల్లాలో ఇళ్లకు, బడికి వెళ్ళి తనిఖీలు
పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య
కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విస్తృతంగా పర్యటించారు. జిల్లాకు చేరుకున్న
ముఖ్య కార్యదర్శి వెంటనే క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు. వీరఘట్టం మండలం
రేగులపాడు కేజీబీవీని తనిఖీ చేశారు. 8వ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు
పంపిణీ చేయలేదని గుర్తించారు. అధికారులను దీనిపై ప్రశ్నించారు. సీతంపేట,
భామిని మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. సీతంపేట మండలం మర్రిపాడు ఎంపీపీ
పాఠశాలను పరిశీలించారు. సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ముఖ్య
కార్యదర్శి 8వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల నోట్ పుస్తకాలను
తనిఖీ చేశారు. మ్యాథమేటిక్స్ సిలబస్ పూర్తి చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
“ట్యాబ్”లు ఉపయోగిస్తున్నారా ? అని అడిగారు. ఉపాధ్యాయులు బాగా బోధిస్తున్నారా
?అని అడిగారు. పాఠశాలలో నాడు నేడు పనులు పూర్తి కాకపోవడంపై ఇంజనీరింగ్
అధికారులను ప్రశ్నించారు. మర్రిపాడు ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో
సగం మంది విద్యార్థులు బెంచీల మీద, సగం మంది విద్యార్థులు నేల మీద కూర్చోవడంపై
అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల పుస్తకాలను పరిశీలించారు. వర్క్ బుక్
రాయకపోవడం, సిలబస్ పూర్తి చేయకపోవడం వంటి అంశాలను గమనించారు.
*విద్యాబోధనలో లోపాలు ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. విద్యా బోధన సక్రమంగా
ఉండాలని ఆయన అన్నారు. జగనన్న గోరుముద్ద పధకంలో భాగంగా పంపిణీ చేయాల్సిన
చిక్కీల గడువు తేదీ ముగియడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో జీతాలు
తీసుకుంటూ పర్యవేక్షణ ఎందుకు చేయట్లేదని ఎంఈవోను ప్రశ్నించారు. ఇంత వరకు ఎన్ని
పాఠశాలలు తనిఖీ చేశారు? డీఈవో కి ఎన్ని నివేదికలు సమర్పించారో చూపించాలని
అడిగారు. పాఠశాలలో త్రాగునీరు ప్లాంట్ పనిచేయకపోవడంపై సచివాలయం వెల్పేర్ అండ్
ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లను ప్రశ్నించారు. త్రాగునీరు
ప్లాంట్ పనిచేయకపోతే కంపెనీ యాజమాన్యానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని
ప్రశ్నించారు. మరల 15 రోజుల్లో జిల్లాకు వస్తానని, అప్పటికి అన్ని సమస్యలు
పరిష్కారం కావాలని, అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ జ్యోతి
కుమారి కి ఆదేశించారు.
భామిని జూనియర్ కళాశాలలో నాడు నేడు పనులను పరిశీలించారు. అన్ని తరగతి గదులను
పరిశీలించారు. తరగతి గదుల్లో పనులు ఎందుకు ప్రారంభం చేయలేదని ఇంజనీరింగ్
అధికారులను ప్రశ్నించారు. కళాశాల ప్రహరీగోడ కాకుండా తరగతి గదుల్లో పనులకు
మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జూన్1వ తేది నాటికి కళాశాలలో అన్ని
పనులు పూర్తి కావాలని ఇంటర్మీడియట్ ఆర్జేడీ శారదా కు ఆదేశించారు. భామిని జడ్పి
ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి విద్యార్థుల పుస్తకాలను
పరిశీలించారు. విద్యార్థుల వర్క్ బుక్ లు పూర్తి స్థాయిలో రాయించకపోవడంపై
ఉపాధ్యాయులను ప్రశ్నించారు. భామిని కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు.
విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి వారితో మాట్లాడారు.
వీరఘట్టం మండలంలోని రేగులపాడు కేజీబీవీ సందర్శించిన సమయంలో అక్కడ విద్యా
సంవత్సరం ఆఖరి వరకు పుస్తకాలు ఇవ్వకపోవడంపై డీఈవో ఎస్ డి వి రమణ, కేజీబీవీ
ప్రిన్సిపాల్ రోహిణి, వీరఘట్టం ఎంఈఓ పి.కృష్ణమూర్తి, అసిస్టెంట్ జి సి డి ఓ
రోజా రమణి లను సస్పెన్షన్ చేస్తున్నట్లు తెలిపారు. సీతంపేట మండల ఎంఈవో
ఆనందరావు, మర్రిపాడు ఎంపీపీ పాఠశాల హెచ్ ఎం రామి నాయుడు, భామిని జడ్పి ఉన్నత
పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయుడు రాంబాబులను సస్పెన్షన్ చేస్తున్నట్లు
తెలిపారు. భామిని జడ్పి ఉన్నత పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయుడు సిలబస్
పూర్తి చేయకపోవడం, విద్యార్థులతో వర్క్ బుక్ రాయించకపోవడం వంటి కారణాలతో ఆయనని
సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్
కుమార్, ఐటిడిఎ పీవో కల్పన కుమారి, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, ఇంటర్మీడియట్
ఆర్జేడీ శారద, డీవిఈవో మంజుల వీణ, శ్రీకాకుళం డీఈవో తిరుమల చైతన్య, గిరిజన
సంక్షేమ శాఖ ఈఈ మురళి, డీడీ నగేష్, ఓఎస్డీ ఎడ్యుకేషన్ యుగంధర్, పార్వతీపురం
మన్యం డీడీ సూర్యనారాయణ, పీఆర్ డీఈ కిషోర్, ఏటీడబ్ల్యువోలు, పీఎమ్మార్సీ బృందం
తదితరులు పాల్గొన్నారు.