సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ప్రచార జోరు పెంచాయి రాజకీయ పార్టీలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్కు భారీగా ఆఫర్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.680 కోట్లతో స్టార్టప్ ఫండ్, లక్ష ఉద్యోగాలు, ఓపీఎస్ పునరుద్ధరణ 18-60 ఏళ్ల మహిళలకు నెలకి రూ.1,500 వంటివి వాటితో మేనిఫెస్టో విడుదల చేసింది హస్తం పార్టీ. నవంబర్ 12న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తామని, ఎన్నికైన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తారని ప్రకటించింది. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ పోల్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ధాని రామ్ శైండిల్. ప్రజల అంచనాలను అందుకోవడంలో బీజేపీ విఫలమైందన్నారు.
ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ‘ఇది కేవలం మెనిఫెస్టో కాదు, హిమాచల్ ప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రూపొందించిన పత్రం.’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జి రాజీవ్ శుక్లా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సహా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఎన్నికల హామీ పత్రాన్ని కాంగ్రెస్ విడుదల చేసేంది. కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. పాత పింఛన్ విధానాన్ని పునరుద్దరించి ప్రజల సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశామని, అందుకు వారు తిరస్కరించారని గుర్తు చేశారు. మరోమారు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.