న్యూఢిల్లీ : తెలంగాణలో బీసీ జాబితాలో ఉన్న లింగాయత్, ఆరె, బుక్క సామాజిక
వర్గాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) ఛైర్మన్
హన్స్‌రాజ్ గంగారాం అహిర్‌ను జన అధికార సమితి ప్రతినిధులు కోరారు. దిల్లీలో
ఎన్సీబీసీ ఛైర్మన్‌ను సమితి ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం వారు ఢిల్లీ తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణవ్యాప్తంగా
లింగాయత్, ఆరె, బుక్క సామాజికవర్గాలకు చెందిన వారు 20 లక్షలకుపైగా ఉన్నారని
తెలిపారు. ఈ మూడు కులాలు రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్నా కేంద్రం ఓబీసీ
జాబితాలో చేర్చకపోవడంతో ఆయా సామాజికవర్గాలకు చెందిన వారికి విద్యా,
ఉపాధిరంగంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే
పార్లమెంట్ సమావేశాల్లో ఈ మూడు సామాజిక వర్గాలను ఓబీసీ జాబితాలో చేర్చేలా
బిల్లు ప్రవేశపెట్టేలా చూడాలని ఎన్సీబీసీ ఛైర్మన్‌ను కోరినట్లు వెల్లడించారు.
ఎన్సీబీసీ ఛైర్మన్‌ను కలిసిన వారిలో జన అధికార సమితి అధ్యక్ష, కార్యదర్శులు
చేరాల నారాయణ, కృష్ణమూర్తి తదితరులున్నారు.