నారా లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి పాడెయాత్ర కాబోతోందని వైఎస్ఆర్సీపీ
ఎమ్మెల్సీ కల్యాణి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని నారా లోకేష్ గురించి
టీడీపీ బిల్డప్ ఇస్తోందని కౌంటర్ ఇచ్చారు. లోకేష్ చేసేది యువగళం పాదయాత్ర
కాదని ప్రజలపాలిట గరళ యాత్రని ఎద్దేవా చేశారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు
అనితి చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు కల్యాణి.
ఏమోహం పెట్టుకుని గ్రామాల్లోకి వెళ్తావ్ లోకేష్
నారా లోకేష్ ఏమోహం పెట్టుకుని పాదయాత్రతో గ్రామాల్లోకి వెళ్తారని ఎమ్మెల్సీ
కల్యాణి ప్రశ్నించారు. రైతులకు రూ.87వేల కోట్ల రుణమాఫీ చేస్తామని
మోసగించినందుకా? రూ.14200కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఇవ్వనందుకా?
ఇంటికో ఉద్యోగమని చెప్పి చీట్ చేసినందుకా? నిరుద్యోగులకు రూ.2వేల భృతి
ఇవ్వనందుకా? ప్రతి సంవత్సరం 5లక్షల ఇళ్లు కట్టిస్తామని మోసగించినందుకా? అంటూ
కల్యాణి ప్రశ్నల వర్షం కురిపించారు. వీటన్నింటిపైనా అడుగడుగునా ప్రజలు
నిలదీస్తారన్నారు.
వార్ వన్ సైడ్ కాదు టీడీపీకి సూసైడ్
లోకేష్ పాదయాత్రతో వార్ వన్ సైడ్ కాదు టీడీపీకి సూసైడ్ అవుతుందని స్ట్రాంగ్
కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కల్యాణి. ఒంటరిగా పోటీచేసే సత్తా లేక పోటీచేసే
అభ్యర్థులు దిక్కులేక జనసేన, సీపీఎంతో పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
వైఎస్ఆర్సీపీని గద్దె దించడం కాదు కనీసం పార్టీ జెండా గద్దె ఇంచు కూడా
కదిలించలేరన్నారు.
టీడీపీ తలపెట్టిన బాదుడే బాదుడు, ఇదేంఖర్మ, అమరావతి టు అరసవిల్లి పాదయాత్ర
మాదిరిగానే లోకేష్ పాదయాత్ర కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుందని కల్యాణి చెప్పారు.
పాదయాత్రలో లోకేష్ అబద్దాలు చెబితే ప్రజలే చెప్పులతో కొడతారని హెచ్చరించారు.
శవరాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు
శవరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని ఎమ్మెల్సీ కల్యాణి విరుచుకుపడ్డారు.
పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చి లాక్కున్నారని గుర్తు
చేశారు. 2024 ఎన్నికల్లో 175సీట్లతో జగన్మోహన్ రెడ్డి అఖండ మెజార్టీతో సీఎం
అవుతారని..టీడీపీ పతనం ఖాయమన్నారు. రెండెకరాలు భూమి ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు
వేలకోట్ల ఆస్తులు ఎలావచ్చాయని నిలదీశారామె. ఉమ్మడి రాష్ట్రంలో ఓటుకు నోటు
కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చిన చంద్రబాబుకి క్రెడిబులిటి ఉందా అని
ప్రశ్నించారు.
వైఎస్ఆర్సీపీ పాలనలో 6.31లక్షల మందికి ఉద్యోగాలు
ఈ మూడున్నరేళ్లల్లో గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగులతో కలుపుకుని సీఎం జగన్మోహన్
రెడ్డి లక్షా 55వేల శాశ్వత ఉద్యోగులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్యాణి చెప్పారు.
6500 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 55వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా
పరిగణలోకి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. కోర్టుల్లో 3500 ఉద్యోగాలిచ్చామని,
వార్షిక క్యాలెండర్లో భాగంగా త్వరలో మరో 10వేల ఉధ్యోగాలు ఇవ్వబోతున్నారని
చెప్పారు. 37వేల కాంట్రాక్ట్, 3.71లక్షల ఔట్ సోర్సింగ్ కలుపుకుని మొత్తం
6.31లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని కొనియాడారు. చంద్రబాబు డీఎస్సీ
నోటిఫికేషన్ ఇస్తే..వాటిని కూడా జగన్ భర్తీ చేసారని గుర్తు చేశారు.