వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
హైదరాబాద్ : ప్రజలను వంచించాలని చూస్తోన్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, ఆసలు సినిమా ముందుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. విధ్వంసమైన తెలంగాణను పదేళ్లలో కేసీఆర్ వికాసం వైపు నడిపించారన్నారు. తెలంగాణను వేగంగా అభివృద్ధి చేయాలనే తపనతో ఎక్కువ సమయాన్ని పాలనకే కేటాయించారని పేర్కొన్నారు. పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించిన ఆయన పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేదన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలో నేతలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. ఎప్పటికప్పుడు సమావేశమై పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుదామన్నారు. 2014, 2019లో వరంగల్ ఎంపీ సీటు భారాస గెలిచింది. ఈ సారి కూడా గులాబీ జెండా ఎగరాలి. సన్నాహక సమావేశాల్లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు వస్తున్నాయి. పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి విజయం దిశగా పనిచేద్దాం. ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇద్దామనుకున్నాం. గవర్నర్ ప్రసంగం, శ్వేత పత్రాలతో భారాస, కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు మన మీద నిందలు వేస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని వాళ్ల 420 హామీలతోనే ఎండగట్టాలి. నెలరోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద ప్రజలకు నష్టం కలిగించాయి. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.