విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురు
చూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి విశాఖ కు పరుగులు
పెట్టనుంది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఈ రైలును త్వరలో ప్రారంభించనున్నారు.
అసలు ఈ వందే భారత్ రైలును ఎలా తీర్చిదిద్దారు. దాని ప్రత్యేకతలేంటో ఒకసారి
చూద్దాం.
ఇలా రూపకల్పన : వేగవంతమైన రైళ్లు నడపాలనేది ఎప్పటి నుంచో భారతీయ రైల్వే ఆలోచన.
అలా 2015లో మోడ్రన్ హై స్పీడ్ రైలుకు రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం
టెండర్లను ఆహ్వానించింది. దానికి స్పందన రాకపోవడంతో 2017లో దేశీయంగానే సెమీ
హైస్పీడ్ రైళ్లు తయారీ చేయాలని ప్రభుత్వం దృఢంగా నిశ్చయించుకొంది. గంటకు 160
కి.మీ వేగంతో ప్రయాణించడమే లక్ష్యంగా చెన్నైలోని ఐసీఎఫ్‌లో ‘ట్రైన్-18’
ప్రాజెక్టు పట్టాలెక్కింది. తొలి టెస్ట్ రన్ నిర్వహించగా 180 కి.మీ వేగంతో ఈ
రైలు ప్రయాణించింది. అయితే దేశంలోని ఏ ట్రాక్‌లూ ఆ వేగాన్ని తట్టుకునే
స్థాయిలో లేకపోవడంతో ఈ రైళ్ల వేగాన్ని 130 కి.మీకు పరిమితం చేశారు.
తయారీ వేగానికి బ్రేకులు : 2022 నాటికే 45 రైళ్లను తయారు చేయాలని రైల్వే
బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ కొవిడ్ కారణంగా అది నెరవేరలేదు.
2022 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ త్వరలో 400 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను
తయారు చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ రైళ్ల కోసం
కావాల్సిన 36 వేల చక్రాలను తయారు చేసేందుకు భారత్ ఉక్రెయిన్‌కు ఆర్డర్
ఇచ్చింది. అయితే ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా వాటి రాక ఆలస్యమైంది.
దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన భారత్ చెక్ రిపబ్లిక్, పోలండ్,
మలేసియా, చైనా, అమెరికా దేశాల్లోని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. మన
దేశంలోని స్టీల్ అథారిటీతో 1లక్ష చక్రాలు తయారు చేయాలని ఒప్పందం చేసుకుంది.
దుర్గాపూర్ స్టీల్‌ప్లాంట్ యూనిట్లో వాటి ఉత్పత్తి జరుగుతోంది.
ఇక వందే భారత్ 2.0 విషయానికి వస్తే : వందేభారత్ రైలు బరువు 392 టన్నులు.
తయారీకి రూ.115 కోట్లు ఖర్చవుతోంది. ఈ రైలుకు మొత్తం 16 ఏసీ బోగీలుంటాయి.
1,128 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. జీపీఐఎస్ బేస్డ్ ప్యాసింజర్
ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, వైఫై సదుపాయం, కవచ్
ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, బ్యాక్టీరియా ఫ్రీ ఎయిర్ కండిషనింగ్
సిస్టమ్, అన్ని కోచ్‌లలో రిక్లైనబుల్ సీట్లు, వీటిలో 32 ఇంచుల టెలివిజన్
సదుపాయం ఉన్నాయి. టోమాటిక్ ప్లగ్ డోర్స్, టచ్ ఫ్రీ స్లయిడింగ్ డోర్స్,
ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ యూనిట్, విశాలమైన డ్రైవర్ క్యాబిన్, హయ్యర్
ఫ్లడ్ ప్రొటెక్షన్ ఉంటాయి.