విజయవాడ : వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి అన్ని రైస్ మిల్లుల్లో డ్రయ్యర్లు
ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
రైస్ మిల్లర్లకు అల్టిమేటం జారీ చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక
కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రతి రైస్ మిల్లులో
డ్రయ్యర్ కచ్చితంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. విజయవాడ లోని పౌరసరఫరాల
సంస్థ ప్రధాన కార్యాలయం లో శుక్రవారం అన్ని జిల్లాల రైస్ మిల్లర్ల
ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా ఈ ప్రక్రియను చేపట్టాలని
నిర్ణయించిందని తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించి పంటచేలల్లో ధాన్యం
తడిసినప్పుడు రైతులు పలు రకాల ఇబ్బందులకు గురవుతున్నారని… అలాంటి ధాన్యానికి
సరైన ధర రాక నష్టపోతున్నారని వివరించారు. డ్రయ్యర్ల ఏర్పాటుతో ఈ నష్టాల నుంచి
రైతులను బయట పడవేయవచ్చన్నారు.అందువల్ల మిల్లర్లు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో
పెట్టుకొని డ్రయ్యర్ల ఏర్పాటు తప్పనిసరిగా చేయాలని కోరారు.డ్రయ్యర్ ఒక్కొక్కటి
25 లక్షల రూపాయల ఖర్చు ఉంటుందని మిల్లరంతా కలిసి వెళ్లి మాట్లాడుకుంటే మరికొంత
తగ్గుతుందని చెప్పారు.డ్రయ్యర్లకు విద్యుత్ వినియోగం విషయంలో ఆందోళన
చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యుత్
శాఖ అధికారులతో సమావేశమై రాయితీ కల్పించేందుకు కూడా అంగీకరించినట్లు మంత్రి
వివరించారు.సిఎం ఆదేశాల మేరకు సీజన్లో రైస్ మిల్లుల్లో ప్రత్యేక మీటర్లు
పెట్టుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్
మాట్లాడుతూ రాష్టృంలో ఉన్న 1600 రైస్ మిల్లుల్లో 1053 వరకు డ్రయ్రర్లు ఏర్పాటు
చేయాల్సి ఉందన్నారు. వీటన్నింటిలో తప్పనిసరిగా డ్రయ్యర్లు ఏర్పాటు
చేయాల్సిందేనని మిల్లర్లకు స్పష్టం చేశారు. వచ్చే సెప్టెంబర్ నాటికి ఇందుకు
గడువు విధిస్తున్నాయి చెప్పారు.దీని కోసం రూ.330 కోట్లు మిల్లర్లకు సర్దుబాటు
చేస్తామన్నారు. ఇప్పటికిప్పుడు రూ.100 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
మిల్లర్లకు ప్రభుత్వం నుంచి ఉన్న బకాయిలన్ని ఇస్తామని స్పష్టం చేశారు.