సీఎం జగన్ చొరవతో చిలకలూరిపేటలో గొప్ప ప్రభుత్వాస్పత్రి
రూ.18.5 కోట్లతో పూర్తయిన నిర్మాణం
రూ.2 కోట్ల నిధులతో పరికరాల కొనుగోలు
ఇప్పుడు ఏకంగా 96 మంది సిబ్బంది
ఇప్పుడు డాక్టర్లే 24 మంది ఉన్నారు
టీడీపీ ప్రభుత్వంలో అంతా కలిసి 20 మంది సిబ్బందే
దశాబ్దాలుగా నియోజకవర్గానికి టీడీపీ నాయకులు చేసిందేమీ లేదు
నాలుగేళ్లలోనే చిలకలూరిపేటకు గొప్ప ఆస్పత్రిని తీసుకొచ్చాం
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సహకారంతో
చిలకలూరిపేటలో అత్యాధునికంగా నిర్మించిన ఏరియా ఆస్పత్రి భవనాన్ని వచ్చే
నెల మూడో తేదీన ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
విడదల రజిని తెలిపారు. అదే రోజు రూ.9.5 కోట్ల నిధులతో సీసీ రోడ్లు,
రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయబోతున్నామని
వెల్లడించారు. చిలకలూరిపేటలో కొత్తగా నిర్మించిన 100 పడకల ఏరియా
ఆస్పత్రిని బుధవారం మంత్రి విడదల రజిని వైద్య ఆరోగ్య శాఖ
ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని
మాట్లాడుతూ రూ.18.5 కోట్ల నిధులతో తమ ప్రభుత్వం చిలకలూరిపేటలో ఏరియా
ఆస్పత్రిని నిర్మించిందని తెలిపారు. అత్యాధునిక వసతులతో ఈ ఆస్పత్రిని
తాము అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
పాత పాలనలో దుస్థితిలో ఆస్పత్రి : దశాబ్దాలుగా కేవలం 30 పడకల
సామర్థ్యంతో చిలకలూరిపేట ఆస్పత్రి ఉన్నా సరే… గత పాలకులు
పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. చిలకలూరిపేట పట్టణంలో
లక్షన్నర మందికిపైగా జనాభా ఉన్నారని, పైగా జాతీయరహదారికి ఆనుకుని
ఆస్పత్రి ఉందని పేర్కొన్నారు. అయినా సరే ఇక్కడ ఒక మంచి ఆస్పత్రిని
ప్రజలకు అందుబాటులోకి తీసుకొద్దామనే ఆలోచనే టీడీపీ ప్రభుత్వం చేయలేదని
వెల్లడించారు. గతంలో ఎన్నికలకు ముందు హడావుడిగా 100 పడకల ఆస్పత్రి
నిర్మాణం అంటూ టీడీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారని తెలిపారు. పక్కనే
ఓగేరు వాగు ప్రవహిస్తున్నా సరే, కనీసం రిటైనింగ్ వాల్ నిర్మించాలనే స్పృహ
లేకుండా హడావుడిగా గతంలో పనులు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. తమ
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించామని,
కేవలం పునాదుల వద్దనే ఆస్పత్రి నిర్మాణం ఆగిపోయి ఉందని తెలిపారు. అది
కూడా వర్షం వస్తే భవనంలోకి నీరు వచ్చే పరిస్థితుల్లో అప్పట్లో నిర్మాణం
చేపట్టిన విషయాన్ని గమనించామని పేర్కొన్నారు. భవనం బేస్మెంట్ లెవల్
పెంచడం, నూతన ఆస్పత్రి ప్రాంగణం చుట్టూ రిటైనింగ్ వాల్ ఏర్పాటుచేయడం
గురించి తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, ఆ మేరకు అనుమతులు
వచ్చాయని వివరించారు. అందుకోసం ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్
మోహన్‌రెడ్డి రూ.9.5 కోట్ల నిధులు విడుదల చేశారని, ఆ పనులకు కూడా ఈ నెల
మూడో తేదీనే శంకుస్థాపన చేస్తున్నామని వివరించారు.
అత్యాధునిక వసతులతో భవనం : తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చిలకలూరిపేట ఆస్పత్రిని సీహెచ్‌సీ
స్థాయి నుంచి ఏహెచ్ స్థాయికి పెంచారని తెలిపారు. ఈ ఆస్పత్రిలో గతంలో
పరికరాలే ఉండేవికావని చెప్పారు. ఇప్పుడు జగనన్న రూ.2 కోట్ల నిధులు
మంజూరు చేసి, అత్యాధునిక పరికరాలను ఆస్పత్రిలో సమకూర్చామని
పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధులతో మరిన్ని పరికరాలను ఆస్పత్రిలో
ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గతంలో ఆస్పత్రిలో
సిబ్బంది కొరత విపరీతంగా ఉండేదని, అందుకే అవుట్ పేషెంట్ల సంఖ్య కూడా
పడిపోయిందని తెలిపారు. గతంలో కేవలం15 మంది సిబ్బంది ఉంటే.. ఇప్పుడు ఏకంగా
96 పోస్టులు మంజూరు చేసి, నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. ఇప్పుడు
ఆస్పత్రిలో డాక్టర్లే ఏకంగా 23 మంది ఉన్నారని వివరించారు. అన్ని రకాల
స్పెషాలిటీ సేవలు కూడా అందుతున్నాయని వెల్లడించారు.
టీడీపీ పాలనలో అంతా శూన్యం : చిలకలూరిపేట నియోకవర్గానికి టీడీపీ
పాలనలో ఒరిగిందేమీ లేదని, తాము కేవలం నాలుగేళ్ల కాలంలోనే అత్యాధునిక
వసతులతో 100 పడకల ఆస్పత్రిని చిలకలూరిపేట ప్రజలకు అందుబాటులోకి
తీసుకురాగలిగామని వెల్లడించారు. రూ.150 కోట్లతో అమృత్ పథకం, రూ.30
కోట్లతో కేంద్రీయ విద్యాలయం, రెండు గురుకుల పాఠశాలల నూతన భవనాలు,
రూ.100 కోట్లతో కొండవీడు అభివృద్ధి, కనపర్రు వంతెన, ఓగేరు వాగు వంతెన,
పసుమర్రు మంచినీటి పథకం, రూ.900 కోట్లతో బైపాస్ నిర్మాణం, ఆటోనగర్
అభివృద్ధి, దాదాపు 500 కోట్ల రూపాయలతో నియోజకవర్గం వ్యాప్తంగా
సీసీరోడ్లు, డ్రెయిన్లు, నాడు- నేడు పథకం కింద ఆస్పత్రులు, పాఠశాలల
అభివృద్ధి, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం, గ్రామ
సచివాలయాలకు నూతన భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, అగ్రిల్యాబ్
నిర్మాణం.. ఇలా నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏకంగా రూ.2వేల కోట్ల రూపాయల
వరకు అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. టీడీపీ కేవలం మాటలకే
పరిమితమైతే… మేం అభివృద్ధిని చేతల్లో చేసి చూపించామని తెలిపారు. సంక్షేమ
పథకాల ద్వారానే నియోజకవర్గంలో ఇప్పటివరకు వెయ్యి కోట్ల రూపాయలకు
పైగా నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏపీవీవీపీ కమిషనర్ వెంకటేశ్వర్, ఏపీఎం ఎస్ ఐడీసీ ఎస్ఈ
చిట్టిబాబు, డీసీహెచ్ఎస్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.