వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శినమిచ్చారు. ఈ వేడుకను
వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తజనాలు తరలివచ్చారు. వివరాల్లోకి వెళ్తే కడప
జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో
భాగంగా మూడో రోజు వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శించారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా
జరిగింది. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలతో వటపత్రశాయి అలంకారంలో ఉన్న
కోదండరాముని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కనుల
పండువగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని
దర్శించుకున్నారు.పురాణాల ప్రకారం జల ప్రళయం సంభవించినపుడు మర్రి ఆకుపై తేలియాడుతూ శ్రీ
మహావిష్ణువు చిన్న శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోటిలో
పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తుచేస్తూ స్వామివారు భక్తులకు
దర్శనమిచ్చారు. భక్తుల కష్టాలను కడతేర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని స్వామివారు
ఈ అలంకారం ద్వారా ముందుకొస్తారని భక్తుల నమ్మకం. కాగా శ్రీ కోదండరామస్వామి
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల ఐదో తేదీన జరిగే కల్యాణానికి
సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఐదో తేదీన స్వామివారి కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
హాజరుకానున్నారు. సీతారాముల కల్యాణానికి తలంబ్రాలను, పట్టువస్త్రాలను
సమర్పించనున్నారు. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్త జనాలు సీతారాముల కల్యాణ
మహోత్సవాన్ని వీక్షించేందుకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాలను, కల్యాణ
వేదిక వద్ద జరుగుతున్న పనులను పరీశిలించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి
తెలిపారు. దీంతో పాటు ఈ ఏడాది వినూత్నంగా ప్రసాదాలను ముందుగానే
కంపార్ట్మెంట్లో అందించనున్నట్లు ఆయన వెల్లిడించారు.దీనివల్ల
కోదండరామస్వామివారి కల్యాణ మహోత్సవం అయిపోయిన అనంతరం భక్తులు ప్రసాదాల కోసం
వేచిచూడకుండా సంతోషంగా నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చని ఆయన తెలిపారు. ఈ క్రమంలో
భక్తులు నేరుగా వెళ్లిపోయేందుకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి
చేయాలని అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు. కల్యాణానికి సంబంధించిన అన్ని
ఏర్పాట్లను పరిశీలించే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్
రెడ్డి, టీటీడీ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
“లోకల్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌తో కలిసి ఐదో తేదీన జరుగబోయే కోదండరామస్వామి
వారి కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించాము. అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా
జరిగాయి. ఈ ఏడాది వినూత్నంగా ప్రసాదం ముందే కంపార్ట్మెంట్లో ఏర్పాటు
చేయనున్నాము. స్వామివారి కల్యాణానికి ముందుగానే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్
జరుగుతుంది. భక్తులు ప్రసాదాన్ని తీసుకున్న అనంతరం కల్యాణ మహోత్సవంలో
పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లను చేశాం. దీనివల్ల సీతారాముల కల్యాణం అయిపోయిన
అనంతరం భక్తులు ప్రసాదం కోసం వేచిచూడకుండా సంతోషంగా వెళ్లిపోయే అవకాశం
ఉంటుంది. ఐదో తేదీన జరగబోయే కల్యాణ మహోత్సవానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం
జగన్మోహన్ రెడ్డి విచ్చేసి సీతారాముల కల్యాణానికి తలంబ్రాలను, పట్టువస్త్రాలను
సమర్పించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మా రెడ్డి తెలిపారు.