వాషింగ్టన్: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన
ప్రైవేట్ సైన్యం ‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని
అమెరికా నిఘా సంస్థ సీఐఏ అధిపతి డేవిడ్ పేట్రాయస్ హెచ్చరించారు. తెరిచి ఉన్న
కిటికీల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రిగోజిన్‌కు సూచించారు. గతంలో
పుతిన్ ప్రత్యర్థులు చాలామంది ఇలా తెరిచి ఉన్న కిటికీల నుంచి జారిపడి
మరణించారని పేట్రాయస్ పరోక్షంగా తెలియజేశారు. తిరుగుబాటు చర్య నుంచి వెనక్కి
తగ్గడం ద్వారా ప్రిగోజిన్ ప్రస్తుతానికి ప్రాణాలు కాపాడుకున్నాడని, కానీ
వాగ్నర్ గ్రూప్‌ను పోగొట్టుకున్నాడని అభిప్రాయపడ్డారు. రష్యా అధికార పీఠం
పెత్తనాన్ని ప్రశ్నించినవారు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలు గతంలో
చోటుచేసుకున్నాయి. సోవియట్ కూటమిలోనూ, ఆ తర్వాత రష్యాలోనూ ఇలాంటి మరణాలు
సంభవించాయి. కిటికీల నుంచి కింద పడిపోయి చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. తనపై
తిరుగుబాటు చేసిన వారిని పుతిన్ అంత సులభంగా వదిలిపెట్టబోరని ఆయన గురించి
తెలిసిన నిపుణులు చెబుతున్నారు. ప్రిగోజిన్ ప్రస్తుతం బెలారస్‌కు
చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అక్కడ సురక్షితంగా ఉంటారా? అంటే చెప్పలేని
పరిస్థితి నెలకొందని అంటున్నారు.